తెలంగాణ రాష్ట్రంపై కేంద్రం ప్రభుత్వం తీవ్ర వివక్ష చూపుతోందని టీఆర్‌ఎస్ కార్యనిర్వాహక అధ్యక్షుడు, ఎమ్మెల్యే కేటీఆర్ అన్నారు. తెలంగాణ భవన్‌లో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో ఆయన మాట్లాడుతూ.. ‘మిషన్ భగీరథ, మిషన్ కాకతీయను అందరూ ప్రశంసించారు. మిషన్ భగీరథకు కేంద్ర అవార్డు లభించింది. బంగాల్, బిహార్, తమిళనాడు, ఒడిశా తదితర రాష్ట్రాల అధికారులు మిషన్ భగీరథను అధ్యయనం చేస్తున్నారు. గజ్వేల్‌లో మిషన్ భగీరథ మొదటి దశ ప్రారంభోత్సవానికి మోడీ వచ్చారు. మిషన్ భగీరథ పథకం ఆచరణాత్మకంగా ఉందని కేంద్రం పేర్కొంది. కానీ, ప్రశంసలు తప్ప కేంద్ర ప్రభుత్వం పైసలు విదిల్చే పరిస్థితిలో లేదు. మిషన్ భగీరథ, మిషన్ కాకతీయకు రూ.24 వేల కోట్లు ఇవ్వాలని నీతి ఆయోగ్ సిఫార్సు చేసినా కేంద్రం పట్టించుకోవడంలేదు.’
‘తెలంగాణ పట్ల కేంద్రం అనుసరిస్తున్న విధానాన్ని తీవ్రంగా నిరసిస్తున్నాం. ఇదే పక్షపాత వైఖరి కొనసాగిస్తే బీజేపీకి 17 ఎంపీ సీట్లలో డిపాజిట్లు గల్లంతవుతాయి. 2014 ఒక ఎంపీ సీటు వచ్చింది ఈసారి ఆ ఒక్కటి కూడా రాదు. ఐటీఐఆర్, బయ్యారం ఉక్కు పరిశ్రమ, గిరిజన వర్సిటీ, కాజీపేట కోచ్ ఫ్యాక్టరీ ఏర్పాటుపై కేంద్రం నుంచి స్పందన కరవైంది. బయ్యారం ఉక్కు పరిశ్రమ ఇవ్వమని కేంద్రం ప్రకటిస్తే రాష్ట్ర ప్రభుత్వమే ఏర్పాటు చేస్తుంది. కేంద్ర ప్రభుత్వం.. బీజేపీ అధికారంలో ఉన్న రాష్ట్రాల్లో ఒకలా లేనిచోట మరోలా వ్యవహరిస్తోంది. కేంద్రం నుంచి రావాల్సిన బకాయిల్లో అంతులేని జాప్యం జరుగుతోంది. రాజకీయ దురుద్దేశసతో కేంద్రం తెలంగాణ పట్ల సవతితల్లి ప్రేమ చూపుతోంది. ఇప్పటికైనా మార్పు రాకపోవతే బీజేపీ నేతలు మరింత ఘోర పరాభవం ఎదుర్కోవాల్సి ఉంటుంది. బీబీనగర్‌కు ఎయిమ్స్ రావడంలో ఎంపీ బూర నర్సయ్యగౌడ్ కృషి ఉంది’ అని కేటీఆర్ వెల్లడించారు.