టాలీవుడ్‌లో ‘ఉప్పెన’ సినిమాతో హీరోయిన్‌గా ఎంట్రీ ఇచ్చిన బ్యూటీ కృతి శెట్టి. ప్రస్తుతం ఈ బ్యూటీ వరస ఆఫర్లతో బిజీగా ఉంది. ఇక చర్చల దశలో చాలానే ప్రాజెక్టులు ఉన్నట్టుగా తెలుస్తోంది. నాని సరసన ఆమె చేసిన ‘శ్యామ్ సింగ రాయ్’ వచ్చేనెలలో విడుదల కానుంది.
ఇక రామ్ .. నితిన్ .. చైతూ .. సుధీర్ బాబులతో ఆమె చేస్తున్న సినిమాలు సెట్స్ పై ఉన్నాయి. ఈ నాలుగు సినిమాల్లో కూడా ఆమె పాత్రకి ప్రాధాన్యత ఉండటం విశేషం. ఇక ఆ తరువాత సినిమా నాయిక ప్రధానమైనది కావొచ్చని అంటున్నారు. ఈ సినిమాకి నిర్మాత ఎవరో కాదు .. మెగాస్టార్ పెద్ద కూతురు సుస్మిత.
సుస్మిత సొంత బ్యానర్ ను ఏర్పాటు చేసుకుని, వెబ్ సిరీస్ లు నిర్మిస్తోంది. ఇకపై ఆ బ్యానర్ పై సినిమాలను కూడా నిర్మించాలనే ఉద్దేశంతో సన్నాహాలు మొదలుపెట్టింది. నాయిక ప్రధానమైన ఒక కథను ఎంపిక చేసుకున్న ఆమె, ప్రధాన పాత్ర కోసం కృతి శెట్టిని అనుకుందట. కృతి శెట్టి కథ వినడం .. ఓకే చెప్పేయడం జరిగిపోయాయని అంటున్నారు. జీ స్టూడియోస్ తో కలిసి సుస్మిత ఈ సినిమాను నిర్మిస్తుందట. త్వరలోనే మిగతా వివరాలు తెలియనున్నాయి.