టాలీవుడ్‌లో మూవీ ఆర్టిస్ట్స్ అసోసియేషన్(మా) ప్రస్తుత కార్యవర్గం కాలపరిమితి ఈ ఏడాది మార్చి నాటికి పూర్తయింది. కరోనా కారణంగా ఎన్నికలను సెప్టెంబర్‌లో జరపాలని తీర్మానం చేశారు. అప్పుడు కూడా ఎన్నికలు జరుగుతాయో లేదో అనే సందేహాలు వెలువడుతున్నాయి. సినిమా పెద్దలంతా ఏకగ్రీవమై ఓ ప్యానెల్‌ను ప్రతిపాదిస్తే ఎన్నికల బరినుంచి తప్పుకుంటానని మంచు విష్ణు ప్రకటించాడు. ఎన్నికల బరిలో నిలబడాలనుకునే ప్రకాష్ రాజ్ వంటివారు ఎన్నికలు ఎప్పుడు అంటూ సోషల్ మీడియాలో ప్రశ్నిస్తున్నారు. ప్రకాష్ రాజ్‌కు చిరంజీవి సోదరుడు నాగబాబు మద్దతిస్తున్నాడు. బాలకృష్ణ వంటి వారు ఇంతవరకు ‘మా’ చేసిన కార్యక్రమాలపై అసంతృప్తి వ్యక్తం చేస్తూ పలు వ్యాఖ్యలు చేసిన సంగతి తెలిసిందే.
గతేడాది ‘మా’ డైరీ ఆవిష్కరణ సమయంలో జరిగిన సంఘటనల కారణంగా సీనియర్ నటుడు కృష్ణంరాజు అధ్యక్షుడిగా క్రమశిక్షణ మరియు సమన్వయ సంఘాన్ని ఏర్పాటుచేశారు. ఇందులో చిరంజీవి, మోహన్‌బాబు, మురళీమోహన్, జయసుధ సభ్యులుగా ఉన్నారు. ‘మా’ లోని సభ్యుల మధ్య తలెత్తిన విభేదాలను పరిష్కరించేందుకు ఈ కమిటీ కృషిచేస్తుంది. మా సభ్యుల్లో ఏదైనా సమస్య తలెత్తితే వాటి పరిష్కారంలో ఈ కమిటీదే తుది నిర్ణయం. ‘మా’ ప్రస్తుత కార్యవర్గం ఎన్నిక వ్యవహారాన్ని ఈ కమిటీకి అప్పగించినట్టు తెలుస్తోంది. ఎన్నికలు ఎప్పుడు జరపాలనే విషయంపై కమిటీలోని మిగతా సభ్యుల అభిప్రాయాలు తీసుకుని కృష్ణంరాజు ఓ నిర్ణయం వెల్లడించే అవకాశం ఉందని తెలుస్తోంది.