ప్రముఖ సినీ గాయకుడు ఎస్పీ బాలసుబ్రహ్మణ్యం మృతి పట్ల సూపర్ స్టార్ కృష్ణ, రెబల్ స్టార్ కృష్ణంరాజు దిగ్భ్రాంతిని వ్యక్తం చేశారు. కృష్ణ మాట్లాడుతూ..బాలుతో తనకున్న అనుబంధాన్ని నెమరువేసుకుంటూ ఓ భావోద్వేగ వీడియోను పోస్ట్ చేశారు. ‘ఈరోజు బాలు మన మధ్య లేకపోవడం చాలా దురదృష్ణకరం. ‘నేనంటే నేనే’ సినిమాకి బాలు చేత అన్ని పాటలు పాడించాలని కోదండపాణిగారు ప్రపోజ్ చేశారు. దానికి మేమంతా ఒప్పుకున్నాం. ఆ సినిమాకి అన్ని పాటలు బాలు పాడారు. ఆ సినిమా సూపర్ హిట్ అయింది. ఘంటసాలగారు బతికున్నప్పుడు కూడా నాకు అన్ని పాటలు బాలు పాడేవారు. బాలు మన మధ్య లేకపోవడం బాధాకరం. అతనికి శ్రద్ధాంజలి ఘటిస్తున్నా. వారి కుటుంబానికి నా సంతాపాన్ని తెలియజేస్తున్నా’ అని కృష్ణ తెలిపారు.
కృష్ణం రాజు మాట్లాడుతూ.. బాలు మృతిపై ఓ ప్రకటన విడుదల చేసిన ఆయన.. సినిమా పాట అనాథ అయ్యిందని ఆవేదన వ్యక్తం చేశారు. గంధర్వుడు ఎస్పీ బాలసుబ్రహ్మణ్యం మృతి పట్ల వారి కుటుంబ సభ్యులకు నా ప్రగాఢ సానుభూతి తెలియజేస్తున్నాను అంటూ తన ప్రకటనలో పేర్కొన్న కృష్ణంరాజు.. బాలు గారితో దశాబ్దాల అనుబంధం గుర్తొస్తుంటే కన్నీరు ఆగట్లేదు.. ఒక గొప్ప స్నేహితుడిని ఈరోజు నేను కోల్పోయానన్నారు. భారత చలన చిత్ర పరిశ్రమలో బాలు లాంటి గాయకుడు మళ్లీ పుట్టరు. ఈ భూమి మీద పాట ఉన్నంత వరకు బాలు బతికే ఉంటారు అని అన్నారు.