టాలీవుడ్ యంగ్ హీరో నాగశౌర్య నటించిన తాజా చిత్రం ‘కృష్ణ వ్రింద విహారి’. షెర్లీ సెటియా హీరోయిన్ నటించిన ఈ సినిమాలో రాధిక కీలకమైన పాత్రను పోషించింది. ఈ రోజు ( సెప్టెంబరు 23) ప్రేక్షకుల ముందుకు వచ్చింది.
కథ:
కృష్ణాచారి (నాగశౌర్య) గోదావరి జిల్లాలకు చెందిన ఓ బ్రాహ్మణ యువకుడు. అతని తల్లి అమృతవల్లి (రాధిక)కి ఆ ప్రాంతంలో మంచి పేరు ఉంటుంది. ఆమె మాటను కాదనేవారు అక్కడ దాదాపుగా ఉండరు. ఆచార వ్యవహారాలకు .. సంప్రదాయానికి ఆమె ప్రాణం ఇస్తుంది. అలాగే తన కొడుకైన కృష్ణాచారిని పద్ధతిగా పెంచుతుంది. ఐటీ కంపెనీలో జాబ్ రావడంతో కృష్ణాచారి హైదరాబాదు వచ్చేస్తాడు. తొలి చూపులోనే తన టీమ్ లీడర్ అయిన ‘వ్రింద’పై మనసు పారేసుకుంటాడు. అప్పటికే ఆమె వెంటపడుతున్న ప్రాజెక్టు మేనేజర్ నందన్ (అమితాష్ ప్రధాన్)కి శత్రువుగా మారతాడు.
నందన్ బారి నుంచి తప్పించుకోవడానికి కృష్ణ వైపు మొగ్గు చూపిన వ్రింద, నిజంగానే అతనితో ప్రేమలో పడుతుంది. అయితే పెళ్లి పట్ల అనాసక్తిని చూపుతుంది. తనకి గల అనారోగ్యం కారణంగా తనకి పిల్లలు పుట్టే ఛాన్స్ లేదని చెబుతుంది. అయినా ఆమెను పెళ్లి చేసుకోవడానికి తాను సిద్ధంగానే ఉన్నానని కృష్ణ అంటాడు. కాబోయే కోడలికి ఆడపిల్ల పుట్టాలని ఆశతో తల్లి ఎంతగానో ఎదురు చూస్తోందనే విషయం కృష్ణకి తెలుసు. అందుకోసమే అనుకోకుండా జరిగిన ఒక ప్రమాదం కారణంగా, తనకి పిల్లలు పుట్టే అవకాశం లేకుండా పోయిందని తల్లితో అబద్ధం చెబుతాడు. కృష్ణ – వ్రింద పెళ్లికి అమృతవల్లి ఒప్పుకుంటుంది. కృష్ణ ఆడిన అబద్ధం ఎలాంటి పరిణామాలకి దారితీస్తుంది? ఒక అబద్ధాన్ని అబద్ధమని నిరూపించడానికి ఆయన ఎలాంటి పరిస్థితులను ఎదుర్కోవలసి వచ్చింది? అనేదే మిగతా కథ.
నటీనటులు:
నటన పరంగా నాగశౌర్య చాలా బాగా చేశాడు. అతని లుక్ ఆకట్టుకుంటుంది. హీరోయిన్ షెర్లీ సెటియా కూడా పాత్రకి తగినట్టుగా చేసింది. హీరోయిన్ తన పాత్రకి తానే డబ్బింగ్ చెప్పుకోవడం అభినందించవలసిన విషయమే. ఇక రాధిక నటన గురించి ప్రత్యేకంగా చెప్పవలసిన పనిలేదు. అమితాష్ ప్రధాన్ కూడా పాత్ర పరిధిలో నీట్ గా చేశాడు. బ్రహ్మాజీ, సత్య, వెన్నెల కిషోర్ కామెడీ వర్కౌట్ అయింది. జయప్రకాష్, అన్నపూర్ణ తదితరులు తమ పరిధి మేరకు నటించారు.
విశ్లేషణ:
కథ చాలా రొటీన్ అనే చెప్పాలి. ఇలాంటి కథలు ఇంతకుముందు చాలానే వచ్చాయి. తెలిసిన కథే అయిన ఫ్రెష్‌గా, కామెడీగా ఉండటం ఈ సినిమాకి కలిసి వచ్చింది. ఫస్టాఫ్ సాదా సీదాగా సాగిపోతుంది. సెకండాఫ్ లో కాస్త పుంజుకుంటుంది. హీరో హీరోయిన్ పెళ్లి తరువాత అత్త, కోడళ్ల మధ్య జరిగే పంచాయితీ నవ్వులు పండిస్తుంది. వెన్నెల కిషోర్ కోమాలోకి వెళ్లినప్పుడు అతనితో సత్య, రాహుల్ రామకృష్ణ, నాగశౌర్య చేసే కామెడీ బాగుంటుంది. పాటలు సందర్భానికి తగినట్టుగా వచ్చి పోతుంటాయి. నేపథ్య సంగీతం చాలా బాగుంది. సాయి శ్రీరామ్ కెమెరా పనితనం బాగుంది. నిర్మణ విలువలు సినిమా స్థాయికి తగ్గట్లుగా ఉన్నాయి.
టైటిల్ : ‘కృష్ణ వ్రింద విహారి’
నటీనటులు : నాగశౌర్య, షిర్లీ సెటియా, రాధిక, వెన్నెల కిషోర్, రాహుల్ రామకృష్ణ, జయప్రకాష్, సత్య, అన్నపూర్ణ తదితరులు
నిర్మాత: ఉష ముల్పూరి
దర్శకత్వం: అనీష్ కృష్ణ
సంగీతం : మహతి స్వర సాగర్
హైలైట్స్: కామెడీ, సెకండాఫ్
డ్రాబ్యాక్స్: రొటీన్ కథ
చివరిగా: పర్వలేదనిపించేలా.. ‘కృష్ణ వ్రింద విహారి’
(గమనిక: ఇది కేవలం సమీక్షకుడి వ్యక్తిగత అభిప్రాయం మాత్రమే)