సీనియర్ హాస్య నటి కోవై సరళ గురించి ప్రత్యేకంగా చెప్పనవసరం లేదు. తమిళంతో పాటు తెలుగు చిత్రాల్లోనూ తనదైన మార్కు హాస్యంతో ఆకట్టుకున్నారామె. 2019 లో వచ్చిన `అభినేత్రి 2` చిత్రంతో తెలుగు ప్రేక్షకుల్ని పలకరించిన ఆమె కొంత విరామం తరువాత మరో విభిన్నమైన సినిమాతో ప్రేక్షకుల ముందుకు రాబోతోంది. ఆమె నటిస్తున్న తమిళ చిత్రం `సెంబి`. ఇందులో ఆమె సరికొత్త మేకోవర్ తో ఎవరూ గుర్తు పట్టలేని విధంగా కనిపించబోతోంది.
ప్రభు సాల్మన్ డైరెక్షన్‌లో వస్తున్న ఈ సినిమా ఫస్ట్ లుక్ పోస్టర్ ని దర్శకుడు విడుదల చేశాడు. రఫ్ లుక్ లో కోవై సరళ కనిపిస్తున్న తీరు ప్రతీ ఒక్కరినీ షాక్ కు గురిచేస్తోంది. ప్రభు సాల్మన్ ఇటీవల రానా దగ్గుబాటి హీరోగా `అరణ్య` పేరుతో ఓ భారీ చిత్రాన్ని తెరకెక్కించిన విషయం తెలిసిందే. భారీ అంచనాల మధ్య విడుదలైన ఈ మూవీ ఐదు భాషల్లోనూ ఆశించిన ఫలితాన్ని అందించలేకపోయింది.
దీని తరువాత కొంత విరామం తీసుకున్న ప్రభు సాల్మన్ సరికొత్త కథ నేపథ్యంలో `సెంబి` చిత్రాన్ని తెరకెక్కిస్తున్నారు. ఈ మూవీలో కోమలి టీవి షో ఫేమ్ అశ్విన్ కుమార్ హీరోగా నటిస్తున్నారు. కోవై సరళ సీరియస్ గా సాగే పాత్రలో కనిపించబోతోంది. `సెంబి` ఓ బస్ జర్నీ నేపథ్యంలో సాగే చిత్రమిది. కొంత మంది పాసింజర్స్ కోడైకెనాల్ టు దిండిగల్ ట్రావెలింగ్ కోసం ఓ బస్ లో ప్రయాణం మొదలు పెడతారు. ఈ క్రమంలో వారు ఎదుర్కొన్న సమస్యలు సంఘటనల సమాహారంగా ఈ మూవీని రూపొందిస్తున్నారు.
ఇదే పేరుతో ఈ సినిమాని తెలుగులోనూ విడుదల చేయబోతున్నారు. ఈ చిత్రంలో డీ గ్లామర్ పాత్రలో నటిస్తున్న కోవై సరళ పాత్ర చాలా విభిన్నంగా వుంటుందని తెలుస్తోంది. ఇతర పాత్రల్లో తంబి రామయ్య చైల్డ్ ఆర్టిస్ట్ నీలా నటించారు.