ఎస్సీ ఎస్టీ, బీసీలకు నామినేటెడ్ పదవులు, పనుల్లో 50 శాతం మేర రిజర్వేషన్లను కల్పించేందుకు రాష్ట్ర ప్రభుత్వం చేస్తున్న ప్రయత్నాలను ప్రతిపక్ష టీడీపీ జీర్ణించుకోలేకపోతోందని నెల్లూరు రూరల్ ఎమ్మెల్యే కోటంరెడ్డి శ్రీధర్ రెడ్డి ఆరోపించారు. శాసనసభలో ప్రశ్నోత్తరాల సమయంలో ‘ఖబడ్దార్ చంద్రబాబు’ అంటూ నేరుగా ప్రతిపక్షనేతను ఉద్దేశించి తీవ్ర వ్యాఖ్యలు చేశారు. గతంలో తాము ప్రతిపక్షంలో ఉండగా కనీసం తమ గోడు చెప్పుకునేందుకు కూడా అవకాశం కల్పించలేదని.. తాము ఆందోళన చేస్తే బయటకు గెంటేశారని అన్నారు. ప్రభుత్వాన్ని అప్రతిష్ఠ పాలు చేస్తే ఖబడ్దార్ అంటూ కోటం రెడ్డి శాసనసభలో పదేపదే వ్యాఖ్యలు చేశారు. దీంతో స్పీకర్ మైక్ కట్ చేశారు.
సభ సజావుగా సాగే అంశంపై అధికార, విపక్ష సభ్యులతో ఉపసభాపతి కోన రఘుపతి విడివిడిగానూ, కలిపి సమావేశమయ్యారు. తేనీటి విరామ సమయంలో వారితో చర్చిస్తూ..తమ సభ్యులపై సస్పెన్షన్‌ను ఎత్తివేయాలన్న టీడీపీ డిమాండ్‌ను శాసనసభ వ్యవహారాల శాఖ మంత్రి బుగ్గన రాజేంద్రనాధ్ రెడ్డి, ప్రభుత్వ చీఫ్ విప్ శ్రీకాంత్ రెడ్డి దృష్టికి తీసుకెళ్లారు. ముఖ్యమంత్రి జగన్ కలెక్టర్లతో టెలీకాన్ఫరెన్స్‌లో ఉన్నందున ఆయనతో చర్చించి..తమ అభిప్రాయాన్ని చెబుతామని వారు ఉపసభాపతికి తెలిపారు.అనంతరం టీడీపీ సభ్యులను ఉపసభాపతి మరోసారి చర్చలకు ఆహ్వానించారు. కరణం బలరాం, గంటా శ్రీనివాస్‌లు ఆయనతో సమావేశమయ్యారు. వైసీపీ నేతలు తమ అధినేత తో మాట్లాడి అభిప్రాయం చెప్తామన్న విషయాన్ని డిప్యూటీ స్పీకర్ వారికి తెలియజేశారు.