రాజశేఖర్ కుమార్తె శివాని రాజశేఖర్ లీడ్ రోల్ చేస్తున్న చిత్రం ‘కోట బొమ్మాళి పీఎస్’. ఇందులో రాహుల్ విజయ్, శ్రీకాంత్, వరలక్ష్మీ శరత్ కుమార్ ఇతర కీలకపాత్రలు పోషిస్తున్నారు. ఈ మూవీకి అర్జున ఫల్గుణ ఫేమ్ తేజ మార్ని డైరెక్టర్. గీతా ఆర్ట్స్2 బ్యానర్‌పై బన్నీ వాస్, విద్యా కొప్పినీడి నిర్మించారు.
నవంబర్ 24న సినిమా విడుదలవుతున్న సందర్భంగా శివాని రాజశేఖర్ మీడియాతో మాట్లాడింది. ‘ఆర్టికల్ 15’ తమిళ్ రీమేక్‌లో నా నటన చూసి తేజ నాకు ఈ కథ చెప్పారు. అందులో ట్రైబల్ అమ్మాయి పాత్ర పోషించాను.
ఇందులోనూ అలాంటి తరహా పాత్ర కావడంతో ఆయన నన్ను సంప్రదించారు. నాయట్టు చిత్రానికి రీమేక్ అయినా తెలుగు ప్రేక్షకులకు అర్థమయ్యేలా ఎన్నో మార్పులు చేశారు. షూటింగ్ మొదలయ్యాక సినిమాపై నాకు మరింత నమ్మకం కలిగింది. ఈ సినిమా కోసం శ్రీకాకుళం యాస కూడా నేర్చుకున్నా.
ఈ మూవీలో పల్లెటూరిలో కనిపించే లేడీ పోలీస్ కానిస్టేబుల్ పాత్ర చేశాను. మా ఫ్యామిలీలో తాతగారు పోలీస్. అలాగే నాన్నగారు చాలా చిత్రాల్లో పోలీస్ ఆఫీసర్‌గా నటించారు. వారి నుంచి తెలియకుండానే ఎన్నో విషయాలు నేర్చుకున్నా. ఈ సినిమా విషయంలో నా గెటప్ కోసం నాన్నగారు కూడా కొన్ని సలహాలు ఇచ్చారు.
గతంలో మా ఫ్యామిలీ గురించి చాలా విషయాలు జరిగాయి. అమ్మానాన్నల అరెస్టు అంటూ ఒక్కొక్కరూ ఒక్కో రకంగా రాశారు. దానితో చాలా వదంతులు ప్రచారం అయ్యాయి. ఒకటి జరిగితే మరోటి ప్రచారం అయ్యేది. అమ్మానాన్నలు జైలుకి వెళ్లలేదు. ఇంట్లోనే అందరం హ్యాపీగా ఉన్నాం అని చెప్పింది.