ఏపీ రాజధాని అమరావతిలోని ఉండవల్లిలో కొండవీటి వాగు ఎత్తిపోతల పథకాన్ని సీఎం చంద్రబాబు ఆదివారం ప్రారంభించారు. లిఫ్ట్ స్కీమ్ దగ్గర పైలాన్‌ను ఆవిష్కరించారు. ఈ సందర్భంగా ముఖ్యమంత్రి మాట్లాడుతూ ఎత్తిపోతల పథకంతో రాజధాని ప్రాంతంలో ముంపు సమస్య తొలగిపోతుందని తెలిపారు. కొండవీటి వాగు ఎత్తిపోతల పథకం నిర్మాణంలో పనిచేసిన ఇంజినీర్లకు అభినందనలు తెలిపారు. మూడు రోజులుగా జలసిరికి హారతి కార్యక్రమం కొనసాగుతోందని, రాష్ట్రాన్ని కరువురహితంగా తీర్చిదిద్దేందుకు జలదీక్ష చేపట్టామని అన్నారు. శ్రీశైలం, నాగార్జునసాగర్ జలాశయాల్లో పూర్తిస్థాయిలో నీరు ఉందని, రాజధాని పరిధిలో చాలా ప్రాంతాలు వరదల కారణంగా మునిగిపోతున్నాయని అన్నారు. ఎత్తిపోతల పథకం ద్వారా సమస్యకు పరిష్కారం లభించిందని చంద్రబాబు పేర్కొన్నారు.
రాజధాని నిర్మాణం కోసం రైతులు 33వేల ఎకరాలు త్యాగం చేస్తే.. ప్రతిపక్ష నేతలు మాత్రం రాజధాని మునుగుతుందని ప్రచారం చేశారని చంద్రబాబు మండిపడ్డారు. రాజధానిలో పనులు జరక్కుండానే.. లక్ష కోట్ల అవినీతి జరిగిందని తప్పుడు ప్రచారం చేశారని ఆయన విమర్శించారు. రోజుకు ఒక టీఎంసీ వరద నీరు వచ్చినా సమస్య లేదన్నారు. 7 వేల క్యూసెక్కుల నీరు ఎత్తిపోసేలా రెండో దశలో ఎత్తిపోతల పథకం చేపట్టనున్నట్లు ఆయన వెల్లడించారు. తన జీవితంలో ఎప్పుడూ పెట్టని శ్రద్ధ జలవనరులశాఖపై పెట్టానని అన్నారు. పోలవరం ప్రాజెక్టుకు కేంద్రం ఇంకా రూ.2,500 కోట్లు ఇవ్వాల్సి ఉందని చంద్రబాబు తెలిపారు. ప్రాజెక్టు పనులు ఆగకుండా రాష్ట్ర ప్రభుత్వం చర్యలు చేపట్టిందన్నారు. దేశంలో ఏ ప్రాజెక్టు పనులు ఇంత వేగంగా జరగట్లేదన్నారు. 2019 మే కల్లా పోలవరం ప్రాజెక్టు నుంచి గ్రావిటీ ద్వారా నిరిస్తామని సీఎం స్పష్టం చేశారు.