HomeTelugu Newsపవన్‌పై విమర్శలు.. కోన వెంకట్‌ క్లారిటీ.. నేను పవన్‌ శ్రేయోభిలాషిని

పవన్‌పై విమర్శలు.. కోన వెంకట్‌ క్లారిటీ.. నేను పవన్‌ శ్రేయోభిలాషిని

14 9జనసేన పార్టీ అధ్యక్షుడు పవన్‌ కల్యాణ్‌ రాజకీయాల్లో విజయవంతంగా రాణించాలని ఆశిస్తున్నట్లు ప్రముఖ రచయిత కోన వెంకట్‌ చెప్పారు. తాజాగా కోన ఓ పత్రికకు ఇంటర్వ్యూ ఇచ్చారు. అందులో ఆయన పవన్‌ను విమర్శించారు. ఇటీవల తెలంగాణను ఉద్దేశించి పవన్ చేసిన వ్యాఖ్యల్ని తప్పుపట్టారు. దీంతో జనసేన అభిమానులు కోనపై మండిపడ్డారు. సోషల్‌మీడియాలో ఆయన్ను విమర్శిస్తూ కామెంట్లు చేశారు. ఇన్నాళ్లూ పవన్‌ను మెచ్చుకుంటూ వచ్చిన కోన.. ఇప్పుడు తమ కుటుంబం రాజకీయాల్లో ఉందనే కారణంగా ఆయన్ను విమర్శిస్తున్నారని కొందరు అభిప్రాయపడ్డారు. దీనిపై కోన స్పష్టత ఇస్తూ… ఓ ప్రకటన విడుదల చేశారు.

‘నిన్న నేను ఓ పత్రికకు ఇచ్చిన ఇంటర్వ్యూకి సంబంధించి కొంత క్లారిటీ ఇవ్వాలి అనుకుంటున్నా. మా కుటుంబం నేను పుట్టక ముందు నుంచే మా సొంత ఊరైన బాపట్లలో రాజకీయాల్లో ఉంది. మీలో చాలా మందికి ఈ విషయం తెలుసు. మా తాత కోన ప్రభాకరరావు కాంగ్రెస్‌ పార్టీలో పలుమార్లు ఎమ్మెల్యేగా, మంత్రిగా, అసెంబ్లీ స్పీకర్‌గా, ఉమ్మడి రాష్ట్రానికి కాంగ్రెస్‌ అధ్యక్షుడిగా, మూడు రాష్ట్రాలకు గవర్నర్‌గా ఒక్క మచ్చలేని రాజకీయ నాయకుడిగా తన ప్రస్థానం కొనసాగించారు. ఆయన మరణం తర్వాత మా బాబాయి కోన రఘుపతి 1995 నుంచి ప్రజాసేవలోకి వచ్చారు. తన సొంత ఆస్తులు కరిగించుకుంటూ ప్రజాసేవలో కొనసాగారు. 2014 ఎన్నికల్లో మా కుటుంబానికి, కోన రఘుపతికి ఉన్న ప్రజాదరణ గుర్తించి జగన్‌ వైసీపీ తరఫున పోటీ చేసే అవకాశం ఇచ్చారు. గెలిచాం. ఈ ఎన్నికల్లో నేను ప్రత్యక్షంగా పాల్గొని నా వంతు కృషి చేశాను. 1983 తర్వాత తిరిగి 2014లో బాపట్లలో కోన కుటుంబాన్ని ప్రజలు ఆదరించారు. ఆ సందర్భంలో నా మిత్రుడైన పవన్‌ కల్యాణ్‌ కూడా అభినందించారు’.

‘2014 తర్వాత జనసేనని బలోపేతం చేసి ప్రజలలోకి తీసుకెళ్లే సందర్భంలో పలుమార్లు నేను ఓపెన్‌ గానే సపోర్ట్‌ చేశా. ఈ క్రమంలో వైసీపీ నుంచి కూడా స్థానికంగా విమర్శలు ఎదుర్కొన్నా. అయినా ఒక మిత్రుడిగా పవన్‌ కల్యాణ్‌ శ్రేయోభిలాషిగా అతనికి మంచి జరగాలని ఆశించి మౌనంగా ఉండిపోయాను. అది నా వ్యక్తిగతం అనే చెప్పాను. నా వ్యక్తిగత అభిప్రాయాలు, రాజకీయ అభిప్రాయాలు వేరు. 30 ఏళ్ల తర్వాత మా కుటుంబాన్ని నమ్మి ఆదరించింది జగన్‌. మాయావతితో పొత్తు విషయంలో, తెలంగాణ విషయంలో ఎవరో తనని మిస్‌ గైడ్‌ చేశారు. అందుకే వాళ్లతో జాగ్రత్తగా ఉండాలని చెప్పా. ఇది కూడా ఎందుకు చెప్పానంటే.. కొంత కాలం క్రితం పవన్‌ కల్యాణ్‌.. కేసీఆర్‌ను కలిసిన సందర్భంలో తనే స్వయంగా ఆయన పాలన గురించి మీడియా ముందు పొగిడారు. అందుకే ఇప్పుడు తను ఇస్తున్న ప్రకటనల మీద నాకు అనుమానం వచ్చింది అంతే. చివరిగా నేను చెప్పేదేంటంటే మన రాజకీయ ఆలోచనలు, మన కులాలు, మతాలు, ప్రాంతాలు, ఆర్థిక స్థోమతలు.. ఇవేవీ స్నేహానికి అడ్డుగోడలు కాకూడదు. పవన్‌ కల్యాణ్‌ తన ప్రయాణంలో అనుకున్నది సాధించాలని మరోసారి మనస్ఫూర్తిగా కోరుకుంటున్నా’ అని కోన ప్రకటనలో పేర్కొన్నారు.

Recent Articles English

Gallery

Recent Articles Telugu