కోలీవుడ్ ప్రముఖ హాస్యనటుడు వివేక్ (59) కన్నుమూశారు. నిన్న ఉదయం 11 గంటలకు గుండెపోటుతో చెన్నైలోని ప్రైవేట్ ఆస్పత్రిలో చేరిన ఆయన.. చికిత్స పొందుతూ శనివారం ఉదయం తుది శ్వాస విడిచారు. దాదాపు 500లకు పైగా చిత్రాల్లో వివేక్ నటించారు. దర్శకుడు కె.బాలచందర్ పరిచయం చేసిన నటుల్లో వివేక్ ఒకరు. మొదట స్క్రిప్ట్ రైటర్‌గా పనిచేసిన వివేక్ ‘మనదిల్ ఉరుది వేండం’ సినిమాతో నటుడిగా అరంగేట్రం చేశారు. ఆ తర్వాత తమిళంలో టాప్ కమెడియన్‌గా పేరు తెచ్చుకున్నారు.
2009లో భారత ప్రభుత్వం పద్మశ్రీతో సత్కరించింది. తెలుగులోనూ డబ్బింగ్ చిత్రాలతో వివేక్ ఎంతోమంది అభిమానులను సంపాదించుకున్నారు. బాయ్స్, శివాజీ, ప్రేమికుల రోజు, అపరిచితుడు, సింగం వంటి చిత్రాలతో తెలుగు ప్రేక్షకులకు దగ్గరయ్యారు. గురువారం చెన్నైలో కరోనా వ్యాక్సిన్ వేయించుకున్న వివేక్.. ప్రజలంతా టీకా తీసుకునేందుకు ముందుకు రావాలని పిలుపునిచ్చారు. ఇంతలోనే వివేక్ ఆకస్మిక మరణంతో తమిళ చిత్ర పరిశ్రమలో తీవ్ర దిగ్భ్రాంతి నెలకొంది. వివేక్ మృతి పట్ల దేవీశ్రీ ప్రసాద్, ఏఆర్. రెహమాన్, సుహాసిని, ప్రకాశ్‌రాజ్, రాఘవ లారెన్స్, జీవా, సమంత, ధనుష్, విజయ్, సహా పలువురు సినీ ప్రముఖులు సంతాపం వ్యక్తం చేశారు.