బాలీవుడ్ విలక్షణ నటుడు అనుపమ్ ఖేర్ భార్య, సీనియర్ నటి, బీజేపీ చండీగఢ్ ఎంపీ కిరణ్ ఖేర్ అనారోగ్యంతో బాధపడుతున్నారు. ఓ రకమైన బ్లడ్ క్యాన్సర్‌కు గురైన కిరణ్ ప్రస్తుతం ముంబైలోని ఆసుపత్రిలో చికిత్స పొందుతున్నారు. ఈ విషయాన్ని చండీఘడ్ బీజేపీ అధ్యక్షుడు అరుణ్ సూద్ బుధవారం విలేకరుల సమావేశంలో వెల్లడించారు. ఆయన మాట్లాడుతూ. .కిరణ్ ఖేర్ గత సంవత్సరం నవంబర్ 11న చండీగఢ్‌లోని తన ఇంట్లో పడిపోవడం వల్ల ఎడమ చేయి విరిగిందని, దీంతో చండీగఢ్‌లోని పోస్ట్ గ్రాడ్యుయేట్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ మెడికల్ ఎడ్యుకేషన్ అండ్ రీసెర్చ్ (పీజీఐఎంఆర్)లో వైద్య పరీక్షలు నిర్వహించారన్నారు. ఇందులో ఆమెకు మల్టిపుల్ మైలోమా ఉన్నట్లు నిర్ధారణ అయ్యిందన్నారు. అనంతరం ఈ వ్యాధి ఆమె ఎడమ చేతి నుంచి కుడి భుజానికి వ్యాపించిందని, వైద్యం కోసం డిసెంబర్ 4న ముంబైలోని ఆసుపత్రిలో చేరిందని పేర్కొన్నారు. నాలుగు నెలల చికిత్స పొందుతున్న కిరణ్ ప్రస్తుతం కోలుకుంటున్నారని ఆమెను ఇకపై ముంబైలోని కోకిలాబెన్ ఆసుపత్రిలో చేరనవసరం లేదన్నారు. కేవలం సాధారణ చికిత్స కోసం ఆసుపత్రిని సందర్శించాల్సి ఉంటుందని అరుణ్ సూద్ తెలిపారు.
కాగా ఈ విషయంపై అనుపమ్ కూడా తన ఆరోగ్యంపై స్పందిచారు. కిరణ్ ఆరోగ్యంపై వస్తున్న పుకార్లకు స్వస్తి పలుకుతూ ఆమెకు రక్త క్యాన్సర్ ఉన్నట్లు నిర్ధారణ అయినట్లు తెలిపారు. ఈ మేరకు ట్విటర్‌లో ఓ పోస్టు పెట్టారు. ‘కిరణ్ మల్టిపుల్ మైలోమాతో బాధపడుతున్నారని మీ అందరికీ తెలియజేయాలనుకుంటున్నాను. ప్రస్తుతం ఆమె చికిత్స పొందుతోంది. త్వరలోనే సంపూర్ణ ఆరోగ్యంతో తిరిగి వస్తుందని మేము ఆశిస్తున్నాం. ఆమె ఎంతో అదృష్టవంతురాలు. అందుకే ఆమెను మీరు ఇంతలా ప్రేమిస్తున్నారు. మీ హృదయంలో ఆమె కోలుకోవాలని ప్రార్థించండి. మీ అందరి ప్రేమకు కృతజ్ఞతలు- అనుపమ్, సికందర్’.. అని ట్వీట్ చేశారు.