టాలీవుడ్ యంగ్ హీరో విజయ్ దేవరకొండపై కొందరు పర్సనల్ గా విమర్శలు చేసిన సంగతి తెలిసిందే. వ్యక్తిగత విషయాలను ప్రస్తావిస్తూ కొన్ని వెబ్‌సైట్‌లు వార్తలు రాయడంపై విజయ్ ఘాటుగా స్పందించాడు. తప్పుడు వార్తలు రాస్తూ తన వ్యక్తిగత భద్రతకు విఘాతం కలిగిస్తున్న కొన్ని వెబ్ సైట్స్ పై తీవ్రస్థాయిలో విరుచుకుపడ్డాడు. ఏవైతే ఇలా తప్పుగా ప్రచారం చేస్తున్నాయో వాటిపై చర్యలు తీసుకోవాలని ఓ వీడియో చేసి విడుదల చేశాడు. దీనికి టాలీవుడ్ నుంచి అనూహ్యమైన మద్దతు లభించింది.
సినీ ప్రముఖులు చిరంజీవి, మహేష్‌బాబు, పూరీ జగన్నాథ్, రవితేజ, రానా తదితరులు విజయ్‌కు మద్దతు తెలిపారు. ‘కిల్ ఫేక్ న్యూస్’ అంటూ సోషల్‌మీడియాలో ట్వీట్లు చేశారు. విజయ్ వెంట మేమున్నామంటూ ప్రముఖులు సైతం మద్దతు పలికారు.
‘ప్రియమైన విజయ్.. నీ ఆవేదనను నేను అర్థం చేసుకోగలను. బాధ్యతలేని రాతల వల్ల మీలా నేను, నా కుటుంబం బాధపడిన సందర్భాలు చాలా ఉన్నాయి. మేమంతా నీకు అండగా ఉన్నాం. ఒకరి వ్యక్తిగత అభిప్రాయాన్ని వార్తగా ప్రచారం చేయొద్దని పాత్రికేయ స్నేహితుల్ని కోరుతున్నా’ అని చిరు ట్వీట్ చేశారు.
‘ఎన్నో ఏళ్ల శ్రమ, త్యాగం, అంకితభావంతో ప్రజల ప్రేమ, గౌరవం పొందుతాం. ఓ మంచి భర్తగా, తండ్రిగా, అభిమానులకు నచ్చిన స్టార్‌గా ఉండేందుకు కృషి చేస్తాం. కానీ గుర్తింపులేని కొందరు వ్యక్తులు డబ్బుల కోసం ఏదైనా చేయడానికి సిద్ధంగా ఉంటారు. మన గౌరవం పోగొట్టేందుకు అబద్ధాలు రాసి, వాటిని ప్రజలతో చదివిస్తారు. ఇలాంటివి సాధారణమని భావించే ప్రపంచం నుంచి మన అందమైన తెలుగు చిత్ర పరిశ్రమను, అభిమానుల్ని, నా పిల్లల్ని సురక్షితంగా ఉంచాలి అనుకుంటున్నా. ఇలాంటి తప్పుడు వార్తలు రాస్తున్న వెబ్‌సైట్లపై తగిన చర్యలు తీసుకోవాలని చిత్ర పరిశ్రమకు పిలుపునిస్తున్నా’ అని మహేశ్ పేర్కొన్నారు. ‘విజయ్ నీ వెంట నేనున్నా’నంటూ ట్వీట్ చేశారు.
పూరీ స్పందిస్తూ.. ‘నువ్వు ఆకలితో ఉన్న ఎన్నో కుటుంబాలకి అన్నం పెట్టావ్. దీని కోసం నీ డబ్బు, సమయాన్ని కేటాయించావు. నిన్ను గౌరవిస్తున్నాం. ఇది మనం పోరాడాల్సిన సమయం. నువ్వే నా ఫైటర్. మా మద్దతు నీకు ఉంటుంది’ అని పోస్ట్ చేశారు.
‘విజయ్ దేవరకొండ చాలా బాగా మాట్లాడావు. నీ వెంట నేనున్నా’ అని రానా దగ్గుబాటి పేర్కొన్నారు. కొరటాల శివ, రవితేజ, రాధిక, హరీష్ శంకర్, అనిల్ రావిపూడి, అల్లరి నరేష్, క్రిష్, రాశీ ఖన్నా, వంశీ పైడిపల్లి, మధుర శ్రీథర్ రెడ్డి, స్మిత తదితరులు విజయ్‌కు మద్దతు తెలిపారు.