సూపర్ స్టార్ రజనీకాంత్, జ్యోతిక ప్రధాన పాత్రల్లో నటించిన సినిమా ‘చంద్రముఖి’. పి.వాసు డైరెక్షన్‌లో వచ్చిన ఈసినిమా అప్పట్లో సంచలన విజయం సాధించింది. కలెక్షన్లు కూడా అదిరిపోయాయి. త్వరలోనే ఈ సినిమాకి సీక్వెల్ ‘చంద్రముఖి 2’ తెరకెక్కించే పనిలో బిజీగా ఉంది మూవీ యూనిట్. రాఘవ లారెన్స్ ఇందులో నటిస్తున్నాడు. ఇక చంద్రముఖి పాత్రలో జ్యోతికను నటింపజేయాలని అనుకున్నారు. కానీ జ్యోతిక ఆ పాత్రలో నటించేందుకు అంగీకరించ లేదు. ఆ తర్వాత సిమ్రన్‌ను సంప్రదించగా ఆమె కూడా కాదన్నారు. ఈ నేపథ్యంలో బాలీవుడ్ భామ కియారా అద్వానీని చంద్రముఖి పాత్రలో నటింపజేసేందుకు ప్రయత్నిస్తున్నారు. ఆమె ఇప్పటికే తమిళ చిత్రం కాంచన హిందీ రీమేక్ అక్షయ్ కుమార్ ‘లక్ష్మీబాంబ్’లో హీరోయిన్‌గా నటించింది. ఆ చిత్రం రాఘవ లారెన్స్ డైరెక్షన్‌లో వచ్చింది. తెలుగులో కియారా ‘భరత్ అనే నేను’తో ఎంట్రీ ఇచ్చింది. ఇక ‘చంద్రముఖి 2’ చిత్రాన్ని పాన్ ఇండియా స్థాయిలో విడుదల చేయాలని అనుకుంటున్నారు.