మెగాస్టార్ చిరంజీవి దాదాపు పదేళ్ళ తరువాత వెండితెరపై కనిపించడానికి సిద్ధమయ్యారు. ‘ఖైదీ నెంబర్ 150’ సినిమాతో బుధవారం ప్రేక్షకుల ముందుకు వచ్చారు. వినాయక్ దర్శకత్వం వహించిన ఈ చిత్రాన్ని రామ్ చరణ్ నిర్మించారు. మరి ప్రేక్షకుల అంచనాలు తగ్గట్లుగా ఈ సినిమా ఉందో.. లేదో.. సమీక్షలోకి వెళ్ళి తెలుసుకుందాం!
కథ:
కలకత్తా సెంట్రల్ జైలు నుండి కత్తి శీను(చిరంజీవి) అనే నేరస్థుడు తప్పించుకొని హైదరాబాద్ కు వస్తాడు. తనను వెతకడానికి పోలీసులు ప్రయత్నిస్తుంటారు. దీంతో అక్కడ ఉంటే పోలీసులు అరెస్ట్ చేస్తారని ఫారెన్ కు వెళ్లిపోవడానికి ప్లాన్ చేస్తాడు. సరిగ్గా ఎయిర్ పోర్ట్ లో శీను, లక్ష్మి(కాజల్) అనే అమ్మాయిని చూసి ప్రేమలో పడతాడు. తన ఫారెన్ ట్రిప్ వదిలేసుకొని లక్ష్మి ప్రేమ కోసం ప్రయత్నిస్తుంటాడు. అయితే కొంతమంది రౌడీలు ఓ వ్యక్తిపై హత్యాయత్నం చేయడం, అతడు అచ్చం తనలానే ఉండడం చూసి కత్తి శీను ఆశ్చర్య పోతాడు. దెబ్బలు తగలడంతో అతడ్ని హాస్పిటల్ లో జాయిన్ చేస్తారు. అతడి పేరు శంకర్(చిరంజీవి) అని తెలుస్తుంది. అయితే శంకర్ ను శీను అనుకొని పోలీసులు అరెస్ట్ చేస్తారు.
దీంతో కత్తి శీను ఫారెన్ కు వెళ్లిపోదామని అనుకుంటాడు. సరిగ్గా అదే సమయంలో కలెక్టర్ కత్తి శీనుని చూసి శంకర్ అని భావించి రైతుల కోసం పాతిక లక్షలు ఇస్తానని చెబుతాడు. ఆ డబ్బు తీసుకొని పారిపోవాలనుకుంటాడు కత్తి శీను. ఇంతలో అగర్వాల్(తరుణ్ అరోరా)అనే పారిశ్రామికవేత్త
రైతుల భూములను తనకు అప్పగిస్తే పాతిక కోట్లు ఇస్తానని కత్తి శీనుతో బేరం పెడతాడు. ఆ డబ్బు మొత్తం తీసుకొని సెటిల్ అయిపోవాలని అనుకుంటాడు. అయితే శంకర్ కు జరిగే సన్మానంలో అసలు శంకర్ ఎవరు..? రైతుల సంక్షేమం కోసం అతడు ఎంతగా పరితపిస్తున్నాడనే విషయాలు తెలుసుకొని తను తప్పు చేశానని తెలుసుకుంటాడు కత్తి శీను. ఆ తరువాత ఏం జరిగింది..? కత్తి శీను రైతుల భూములను అగర్వాల్ నుండి కాపాడడానికి పన్నిన వ్యూహం ఏంటి..? లక్ష్మీ.. కత్తి శీనును ప్రేమిస్తుందా..? అనే విషయాలు తెలియాలంటే సినిమా చూడాల్సిందే!
విశ్లేషణ:
తమిళంలో వచ్చిన కత్తి సినిమాకు రీమేక్ గా రూపొందిన ఈ సినిమాలో మేజర్ గా మార్పులు ఏవి చేయకుండా ఉన్న కథను యధావిధిగా ప్రెజంట్ చేశాడు వినాయక్. మాస్ కమర్షియల్ చిత్రాలను తెరకెక్కించడం దర్శకుడిగా తన మార్క్ ను ఈ సినిమా ద్వారా మరోసారి నిరూపించాడు
వినాయక్. చిరంజీవి రీఎంట్రీ ఇస్తోన్న సినిమా కాబట్టి కథలో అన్ని అంశాలు ఉండేలా సిద్ధం చేసుకొని రూపొందించాడు. కామెడీ ట్రాక్ ను బాగా నడిపించారు.
”సాగు లేదని భూమిని అమ్ముకుంటే సాకలేదని అమ్మని అమ్ముకున్నట్లే..”
”ఊరు తల్లి గర్భం.. మారదు”
”మట్టి తడపడం మానకూడదు.. నీళ్ళతో అయినా కన్నీళ్లతో అయినా.. మట్టి మాత్రం తడవాలి”
ఇలాంటి హార్ట్ టచింగ్ డైలాగ్స్ ను చదువుకున్న ఓ రైతు బిడ్డగా శంకర్ పాత్రలో చిరంజీవి పలుకుతుంటే తెరపై ఆయన తప్ప మరొకరు కనిపించలేదు. అలానే
‘ఏ స్వీట్ వార్నింగ్..”
”పొగరు నా ఒంట్లో ఉంటుంది.. హీరోయిజం నా ఇంట్లో ఉంటుంది..”
”నాది రైట్ వే.. బాస్ ఈజ్ బ్యాక్” అంటూ కత్తి శీను పాత్రలో మాస్ ఆడియన్స్ కు కనెక్ట్ అయ్యే విధంగా చిరు పలికిన డైలాగ్స్ అభిమానులకు ఉత్సాహాన్ని కలిగించాయి. ఆయన నటన గురించి ఎంత చెప్పినా… తక్కువే. రెండు వేరియేషన్స్ ఉన్న పాత్రలో అధ్బుత నటనను కనబరిచారు. ఇది వన్ మ్యాన్ షో అనే చెప్పాలి. చూసే ప్రేక్షకుడి కన్ను చిరుపై తప్ప మరోవైపు తిప్పలేకుండా వినాయక్ చక్కగా సినిమాను తెరకెక్కించాడు. డాన్సుల్లో చిరు ఈజ్ కాస్త తగ్గిందనే చెప్పాలి కానీ ‘రత్తాలు..’,’అమ్మడు లెట్స్ డూ కుమ్ముడు’ అనే పాటల్లో మాత్రం అదరగొట్టారనే చెప్పాలి. చరణ్ తన తండ్రితో కలిసి పాటలో స్టెప్స్ వేయడం మాస్ ను ఉర్రూతలూగించింది. కాజల్ గ్లామర్ కు మాత్రమే పరిమితమైంది. బ్రహ్మానందం తన కామెడీతో నవ్వించాడు. విలన్ గా తరుణ్ అరోరా పాత్రకు అంత వెయిట్ లేదనే చెప్పాలి. దేవిశ్రీప్రసాద్ సంగీతం, రత్నవేలు ఫోటోగ్రఫీ సినిమాకు అసెట్. నిర్మాణ విలువలు బావున్నాయి. మొత్తానికి బాస్ అటు క్లాస్ ఆడియన్స్ తో పాటు మాస్ ఆడియన్స్ ను కూడా మరోసారి ఈ సినిమాతో తన మాయలో పడేసుకున్నాడు.
రేటింగ్: 3.5/5