HomeTelugu Reviews'కేజీయఫ్‌ 2' రివ్యూ

‘కేజీయఫ్‌ 2’ రివ్యూ

KGF Chapter 2 Movie Review
ప్రేక్షకులు ఎంతో ఆసక్తిగా ఎదురు చూస్తున్న చిత్రం ‘కేజీయఫ్‌ 2’. 2018లో వచ్చిన ‘కేజీయఫ్‌’ ఎంతటి ఘన విజయం సాధించిందో అందరికి తెలిసిందే. ఎలాంటి అంచానాలు లేకుండా విడుదలైన ఆ మూవీ బాక్సాఫీస్‌ వద్ద రికార్డులను సృష్టించింది. అలాంటి సినిమాకు సీక్వెల్‌ వస్తుందంటే.. భారీ అంచనాలు ఉండడం సహజం. అందుకు తగ్గట్టే.. కేజీయఫ్‌ 2 తీర్చిదిద్టినట్లుగా టీజర్‌, ట్రైలర్‌ని చూపించారు మేకర్స్‌ . దీంతో ఈ చిత్రం కోసం సినీ ప్రేక్షకులు కల్లల్లో ఒత్తులు వేసుకొని వేచి చూశారు. బహుబలి సీక్వెల్ తర్వాత ఓ మూవీ సీక్వెల్‌ కోసం ప్రేక్షకులు.. అంతా వేచి చూస్తోన్న సినిమా ఏదైనా ఉందంటే అది కేజీయఫ్‌ 2 అనే చెప్పవచ్చు. పలుమార్లు వాయిదా పడిన ఈమూవీ ఈ రోజు గురువారం(ఏప్రిల్‌ 14) ప్రేక్షకుల ముందుకు వచ్చింది. పార్ట్‌ 1 సూపర్‌ హిట్‌ కావడం, పార్ట్‌2 టీజర్‌, ట్రైలర్‌ అదిరిపోవడంతో ‘కేజీయఫ్‌ 2’పై హైప్‌ క్రియేట్‌ అయింది. భారీ అంచనాల మధ్య విడుదలైన కేజీయఫ్‌ 2ని ప్రేక్షకులు ఏ మేరకు ఆదరించారు. కేజీయఫ్‌ 1 స్థాయిని కేజీయఫ్‌2 అందుకుందా చూద్దాం..

కథ: కేజీయఫ్‌ మూవీ ఎక్కడ ముగిసిందో.. అక్కడ నుంచి కేజీయఫ్‌ 2 కథ మొదలవుతుంది. మొదటి పార్ట్‌లో రాకీ భాయ్‌ స్టోరీని ప్రముఖ రచయిత ఆనంద్‌ వాసిరాజు(అనంత్‌ నాగ్‌) చెబితే.. పార్ట్‌ 2లో ఆయన కుమారుడు విజయేంద్రవాసిరాజు(ప్రకాశ్‌ రాజ్‌) కథ చెబుతాడు. గరుడను చంపిన తర్వాత నరాచి లైమ్‌ స్టోన్‌ కార్పొరేషన్‌ను రాకీ భాయ్‌ (యశ్‌) తన ఆధీనంలోకి తీసుకుంటాడు. గరుడ పెట్టే చిత్రహింసల నుంచి బయట పడడంతో అక్కడి కార్మికులు యశ్‌ని రాజుగా భావిస్తారు. తన కోసం ఏదైనా చేయడానికి సిద్ధపడతారు.

ఇక కేజీయఫ్ సామ్రాజ్యంలో తనకు ఎదురులేదని అనుకుంటున్న సమయంలో ‘నరాచి లైమ్‌ స్టోన్‌ కార్పొరేషన్‌’ సృష్టికర్త సూర్యవర్ధన్‌ సోదరుడు అధీరా(సంజయ్‌ దత్‌) తెరపైకి వస్తాడు. అదే సమయంలో రాజకీయంగా కూడా రాకీబాయ్‌ సవాళ్లను కూడా ఎదుర్కొవాల్సివస్తుంది. అతని సామ్రాజ్యం గురించి తెలుసుకున్న భారత ప్రధానమంత్రి రమికా సేన్‌(రవీనా టాండన్‌)..అతనిపై ఓ రకమైన యుద్దాన్ని ప్రకటిస్తుంది. ఒకవైపు అధీరా నుంచి, మరోవైపు రమికా సేన్‌ ప్రభుత్వం నుంచి ముప్పు ఏర్పడిన సమయంలో రాకీభాయ్‌ ఏం చేశాడు? తన సామ్రాజ్యాన్ని ఎలా కాపాడుకున్నాడు? శత్రువులు వేసిన ఎత్తులను ఎలా చిత్తు చేశాడు? తనను దేవుడిగా భావించిన కార్మికుల కోసం ఏదైనా చేశాడా? అమ్మకు ఇచ్చిన మాట కోసం చివరికి ఏం చేశాడు? అనేదే మిగతా కథ.

kgf 2

విశ్లేషణ: 2018లో చిన్న సినిమాగా విడుదలై అతి భారీ విజయం సాధించిన సినిమా ‘కేజీయఫ్‌’. తల్లి చెప్పిన మాటలు, ఆ మాటల ప్రభావంతో పెరిగిన కొడుకు, చివరకు ఓ సామ్రాజ్యానికే అధినేతగా ఎదగడం.. ఇలా కేజీయఫ్‌ చిత్రం సాగుతుంది. ఆ తర్వాత ఏం జరిగిందనేది కేజీయఫ్‌ చాప్టర్‌ 2లో చూపించారు. కేజీయఫ్‌ మాదిరే పార్ట్‌2లో హీరో ఎలివేషన్‌, యాక్షన్‌ సీన్స్‌పైనే ఎక్కువ ఫోకస్‌ పెట్టాడు డైరెక్టర్‌ ప్రశాంత్‌ నీల్‌. పార్ట్‌ 2లో యాక్షన్‌ డోస్‌ మరింత ఎక్కువైందనే చెప్పొచ్చు.

ఫస్టాఫ్‌లో రాకీభాయ్‌ ఎదిగే తీరుని చాలా ఆసక్తికరంగా చూపించాడు. కేజీయఫ్‌ పార్ట్‌నర్స్‌తో జరిపిన మీటింగ్‌, ఇయత్‌ ఖలీల్‌తో జరిపిన డీల్‌ ప్రేక్షకులను ఆకట్టుకుంటాయి. అయితే హీరో ఎలివేషన్స్‌ ఓ రేంజ్‌లో చూపించడం కాస్త ఇబ్బందిగా అనిపిస్తుంది. ముఖ్యంగా ప్రీక్లైమాక్స్‌లో పార్లమెంట్‌లోకి వెళ్లి మాజీ ప్రధానిని చంపడం సినిమాటిక్‌గా అనిపిస్తుంది. ‘కేజీయఫ్‌’ అభిమానులకు మాత్రం ఆ సీన్‌తో సహా ప్రతి సన్నీవేశం నచ్చుతుంది. బహుశా డైరెక్టర్‌ కూడా వారిని మెప్పించడానికే హీరో ఎలివేషన్స్‌లో మరింత స్వేచ్ఛ తీసుకున్నాడేమో. అయితే కథని మాత్రం ఆ స్థాయిలో​ మలచుకోలేకపోయాడు.

కథలో ట్విస్టులు లేకపోవడం మైనస్‌. ఇక అధీర పాత్ర తీర్చిదిద్దిన విధానం బాగున్నప్పటికీ.. రాకీభాయ్‌, అధిరాకు మధ్య వచ్చే ఫైట్‌ సీన్స్‌ మాత్రం అంతగా ఆసక్తికరంగా సాగవు. అధిర పాత్రను మరింత బలంగా చూపిస్తే బాగుండేదేమో. అలాగే అతని నేపథ్యం కూడా సినిమాలో చూపించలేదు. ఫస్ట్‌ పార్ట్‌తో పోలిస్తే.. ఇందులో మదర్‌ సెంటిమెంట్‌ కాస్త తక్కువే అని చెప్పాలి. మధ్య మధ్యలో తల్లి మాటలను గుర్తు చేస్తూ కథను ముందుకు నడిపారు. ఇక హీరో, హీరోయిన్ల మధ్య వచ్చే సీన్స్‌ కథకి అడ్డంకిగా ఉన్నట్లు అనిపిస్తుంది. అయితే చివర్లో మాత్రం తల్లి కాబోతున్న విషయాన్ని హీరోకి తెలియజేసే సీన్‌ హృదయాలను హత్తుకుంటుంది. సముద్రం ఎందుకంత వెలిగిపోతుందని కొడుకు అడిగిన ప్రశ్నకి తల్లి చెప్పిన సమాధానాన్ని, క్లైమాక్స్‌తో ముడిపెట్టడం ఆకట్టుకుంటుంది.

kgf 2a

నటీనటులు: సినిమా స్టార్టింగ్‌లో విలన్లకు సంబంధించిన వ్యక్తి, యశ్‌ గురించి చెబుతూ.. ‘ఇంట్లో ఉన్న ఎలుకలను బయటకు తోలడానికి పాముని పంపారు.. ఇప్పుడు అది నల్ల తాచు అయింది’ అని అంటాడు. అంటే హీరో మరింత బలపడ్డాడు అనే అర్థంతో ఆ డైలాగ్‌ చెబుతాడు. కేజీయఫ్‌2లో యశ్‌ నటన కూడా అంతే. మొదటి భాగంతో పోలిస్తే.. ఇందులో మరింత స్టైలీష్‌గా, తనదైన మేనరిజంలో డైలాగ్స్‌ చెబుతూ..అదరగొట్టేశాడు. రాకీ భాయ్‌ పాత్రకు యశ్‌ తప్పితే మరొకరు సెట్‌ కాలేరు అన్న విధంగా అతని నటన ఉంది. యాక్షన్‌ సీన్స్‌లో విశ్వరూపం చూపించాడు. ఎమోషనల్‌ సీన్స్‌లో కూడా మంచి నటనను కనబరిచాడు.

అధీరగా సంజయ్‌ దత్‌ ఫెర్పార్మెన్స్‌ బాగుంది. ఈ సినిమా షూటింగ్‌కి ముందే సంజయ్‌ దత్‌కి కేన్సర్‌ అని తేలింది. అయినా కూడా ఆయన అధీర పాత్రలో నటించడం అభినందించాల్సిందే. ప్రధానమంత్రి రమికా సేన్‌ పాత్రకి ర‌వీనా టాండ‌న్ న్యాయం చేసింది. రావు రమేశ్‌, ఈశ్వరి భాయ్‌, ప్రకాశ్‌ రాజ్‌తో పాటు ప్రతి ఒక్కరు తమ తమ పాత్రల పరిధిమేర నటించారు. ప్రతి ఒక్కరి పాత్రకి తగిన ప్రాధాన్యత ఉండడం ఈ సినిమా గొప్పదనం.

ఇక సాంకేతిక విషయాలకొస్తే.. ఈ సినిమాకు మరో ప్రధాన బలం ర‌వి బ‌స్రూర్ సంగీతం. అద్భుతమైన నేపథ్య సంగీతంతో సినిమాను మరో మెట్టు ఎక్కించాడు. భువ‌న్ గౌడ‌ సినిమాటోగ్రఫి గురించి ప్రత్యేకంగా చెప్పుకోవాల్సిందే. కేజీయఫ్‌ సామ్రాజ్యాన్ని అందంగా చిత్రీకరించాడు. ప్రతి సీన్‌ని తెరపై చాలా రిచ్‌గా చూపించాడు. ఉజ్వల్‌ ఎడిటింగ్‌ బాగుంది. నిర్మాణ విలువలు సినిమా స్థాయికి తగినట్లుగా ఉన్నాయి.

టైటిల్‌ : కేజీయఫ్‌ చాప్టర్‌ 2
నటీనటులు : య‌శ్, సంజ‌య్ ద‌త్, శ్రీ‌నిధి శెట్టి, ర‌వీనా టాండ‌న్, ప్ర‌కాశ్ రాజ్, అర్చ‌న‌, ఈశ్వ‌రీరావు, రావు రమేశ్‌ తదితరులు
దర్శకత్వం:  ప్రశాంత్‌ నీల్‌
నిర్మాత:విజయ్ కిరగందూర్
నిర్మాణ సంస్థ: హోంబలే ఫిలింస్‌
సంగీతం : ర‌వి బ‌స్రూర్

హైలైట్స్‌‌: య‌శ్ నటన
డ్రాబ్యాక్స్‌: ఎమెషన్‌ పెద్దగా లేకపోవడం

చివరిగా: ‘కేజీయఫ్‌-1’ ధీటుగా ‘కేజీయఫ్‌ చాప్టర్‌ 2’
(గమనిక: ఇది కేవలం సమీక్షకుడి వ్యక్తిగత అభిప్రాయం మాత్రమే)

కాబోయే భార్యకు రణబీర్‌ కాస్ట్లీ గిఫ్ట్‌

Recent Articles English

Gallery

Recent Articles Telugu