తెలంగాణలో ఎన్నికల్లో ప్రచారానికి తాను వెళ్లిన నేపథ్యంలో కేసీఆర్ తనకు రిటర్న్ గిఫ్ట్ ఇస్తానని చేసిన వ్యాఖ్యలను టీడీపీ జాతీయ అధ్యక్షుడు, ఏపీ సీఎం చంద్రబాబు నాయుడు టీడీపీ సమన్వయ కమిటీ సమావేశంలో ప్రస్తావించారు. కేసీఆర్ ఆంధ్రప్రదేశ్ రాజకీయాల్లోకి వస్తే సంతోషమేనని వ్యాఖ్యానించారు. అందరినీ గందరగోళం చేసేందుకే కేసీఆర్ వివిధ రాష్ట్రాల్లో పర్యటనలకు వెళ్తున్నారని విమర్శించారు. ప్రజలకు ఈవీఎంలపై నమ్మకం రావడంలేదని, పోలైన ఓట్ల కంటే కౌంటింగ్‌లో ఎక్కువ ఓట్లు ఎలా వస్తాయని ప్రశ్నించారు. మన ఓటు ఎవరికి పడిందో తెలుసుకోవడం మన ప్రాథమిక హక్కు అని, ఈవీఎంల విషయంలో అందరూ అప్రమత్తంగా ఉండాలని చంద్రబాబు విజ్ఞప్తి చేశారు. వీవీప్యాట్‌లలో గుర్తు సరిగ్గా పడటంలేదని సీఎం విమర్శించారు. రానున్న రోజుల్లో దేశ రాజకీయాల్లో కీలక మార్పులు రానున్నాయన్నారు. అందుకు అంతా మానసికంగా సిద్ధపడాలని సూచించారు. ఆంధ్రప్రదేశ్‌కు ఏమీ చేయకుండా ప్రధాని మోదీ జనవరి 6న రాష్ట్రానికి ఎలా వస్తారని ప్రశ్నించారు.