కేరింత ఫేమ్ పార్వతీశం హీరోగా , ఐశ్యర్య హీరోయిన్‌గా ఓ సినిమా తెరకెక్కుతుంది. ‘దేవరకొండలో విజయ్ ప్రేమకథ’ చిత్రంతో దర్శకుడిగా మంచి పేరు తెచ్చుకున్న వెంకటరమణ ఈ చిత్రాన్ని రూపొందిస్తున్నాడు. వేదుల బాలకామేశ్వరి సమర్పణలో సాయి సిద్ధార్థ మూవీ మేకర్స్ సంస్థ తమ ప్రొడక్షన్ నెం 1గా తెరకెక్కుతున్న ఈ చిత్రానికి సిద్ధార్థ హరియాల, శ్రీమతి తాలబత్తుల మాధవి నిర్మాతలుగా వ్యవహరిస్తున్నారు.
ఈ నెల 25 నుంచి రెగ్యులర్ చిత్రీకరణ ప్రారంభిస్తున్నారు. కాకినాడ, యానాం పరిసర ప్రాంతాల్లో చిత్రీకరణ జరపనున్నారు. ఈ సందర్భంగా మూవీ డైరెక్టర్ వెంకటరమణ ఎస్. మాట్లాడుతూ…ప్రతి మనిషి గౌరవంగా బతకాలి, గౌరవంగా మరణించాలి అని భారత రాజ్యాంగంలోని ఆర్టికల్ 20 చెబుతోంది. అయితే దీనికి భిన్నంగా నేటి సమాజంలో పరిస్థితులు ఉన్నాయి. ఆ పరిస్థితులు మారాలి, ఆర్టికల్ 20 స్ఫూర్తిని కాపాడుకోవాలి అని చెప్పే చిత్రమిది. మంచి సామాజిక సందేశంతో పాటు ఓ విభిన్నమైన ప్రేమకథను ఈ సినిమాలో చూపిస్తున్నాం. అన్నారు.
‘సమాజాన్ని, సమాజాన్ని పాలించే ప్రజా ప్రతినిధులను ప్రశ్నించే చిత్రమిది. సామాజిక సందేశాన్ని ప్రేమకథతో మిళితం చేసి ఓ మంచి చిత్రాన్ని నిర్మిస్తుండటం సంతోషంగా ఉంది’ అని నిర్మాత సిద్దార్థ హరియాల అన్నారు. రామరాజు, చక్రపాణి, రంగస్థలం లక్ష్మి తదితరులు ఇతర కీలక పాత్రల్లో నటిస్తున్నారు.