టాలీవుడ్‌లో ప్రేమకథలకు ఎక్కువ ఆదరణ లభిస్తుంది. కంటెంట్ కనెక్ట్ అయితే చాలు .. బడ్జెట్ తో సంబంధం లేకుండా భారీ వసూళ్లను అందిస్తారు. అందువల్లనే తెలుగు తెరపై ప్రేమకథల ప్రవాహం కొనసాగుతూనే ఉంది.
అలాంటి ప్రేమకథల్లో ఒకటిగా ‘తెలుసా మనసా’ సినిమా రూపొందింది. పార్వతీశం – జశ్విక జంటగా నటించిన ఈ సినిమాను వర్ష – మాధవి నిర్మించారు. గోపీసుందర్ సంగీతం అందించారు. వైభవ్ దర్శకత్వం వహించాడు. ఇది ఒక స్వచ్ఛమైన .. ప్రతిఫలాపేక్షలేని ప్రేమకథ అంటూ మేకర్స్ మరింత ఆసక్తిని పెంచారు.
కొంతసేపటి క్రితం దిల్ రాజు ఈసినిమా ఫస్టులుక్ పోస్టర్ ను విడుదల చేశారు. హీరో ఫ్యామిలీ ఏదో విషయంపై ఆలోచిస్తూ దిగాలుగా కూర్చోవడం ఈ పోస్టర్లో కనిపిస్తోంది. రోహిణి హట్టంగిడి కీలకమైన పాత్రను పోషించిన ఈ సినిమా త్వరలోనే ప్రేక్షకుల ముందుకు రానుంది.