స్త్రీ-పురుష సమానత్వానికి ప్రతీకగా పేర్కొంటూ కేరళలో సీపీఎం నేతృత్వంలోని ఎల్‌డీఎఫ్ ప్రభుత్వం అతిపెద్ద మానవహారం కార్యక్రమం నిర్వహించింది. దాదాపు 50లక్షల మంది మహిళలు, యువతులు, బాలికలు చేయిచేయి కలిపి 620కిలోమీటర్ల పొడవైన మానవహారంగా నిల్చున్నారు. ఇదిలా ఉండగా.. ప్రపంచంలోనే నాలుగో అతిపెద్ద మానవహారంగా కేరళ మహిళల మానవహారం రికార్డు సాధించింది.
గణాంకాల ప్రకారం.. 2017లో బిహార్‌లో నిర్వహించిన మానవహారం ప్రపంచంలోనే అతిపెద్దది. 2017లో బిహార్‌లోని నితీశ్ కుమార్ ప్రభుత్వం పూర్తి స్థాయి మద్యనిషేధం తీసుకొచ్చింది. దీనికి మద్దతు పలుకుతూ దాదాపు 2కోట్ల మంది ప్రజలు 12,760కిలోమీటర్ల పొడవైన మానవహారంగా నిల్చున్నారు. ప్రపంచంలో ఇప్పటివరకు ఇదే అతిపెద్ద మానవహరం కావడం విశేషం.
ఇక 1986లో యునైటెడ్ స్టేట్స్‌లో నిర్వహించిన ‘హ్యాండ్స్ అక్రాస్ అమెరికా’ రెండో అతిపెద్ద మానవహారం. పేద ప్రజలు, ఆకలితో అలమటిస్తున్న నిరాశ్రయులకు సాయం చేసేందుకు అమెరికాలోని ఓ ఛారిటీ సంస్థ మానవహారం ఏర్పాటుచేసింది. ఇందులో దాదాపు 65లక్షల మంది పాల్గొని విరాళాలు ఇచ్చారు.
2004లో బంగ్లాదేశ్‌లో చేపట్టిన ‘అవిశ్వాస’ మానవహారం ప్రపంచంలోనే మూడో అతిపెద్ద మానవహారంగా రికార్డు నమోదు చేసింది. 2004లో బంగ్లాదేశ్‌లోని బీఎన్‌పీ నేతృత్వంలోని సంకీర్ణ ప్రభుత్వానికి వ్యతిరేకంగా ప్రతిపక్ష అవామీలీగ్ ఆధ్వర్యంలో మానవహారం చేపట్టారు. ఇందులో 50లక్షల మందికి పైగా ప్రతిపక్ష పార్టీల కార్యకర్తలు ప్రజలు పాల్గొని 1,050కిలోమీటర్ల పొడవైన మానవహారంగా నిల్చున్నారు.
ఇక నాలుగోది ఈ ఏడాది జనవరి 1న కేరళలో చేపట్టిన మహిళా మానవహరం. కేరళ ఉత్తరభాగంలోని కాసరగాడ్‌లో ప్రారంభమైన ఈ ‘విమెన్ వాల్’.. దక్షిణభాగంలోని తిరువనంతపురంలో గల ‘వెల్లయంబాలమ్’ వరకు సముద్రతీరం వెంబడి రహదారుల మీదుగా కొనసాగింది. ఇందులో దాదాపు 50లక్షల మంది మహిళలు పాల్గొన్నట్లు సీపీఎం తెలిపింది. అయితే 35 లక్షల మందికి పైగా మహిళలు మానవహారంగా నిలుచున్నట్లు ప్రపంచవ్యాప్తంగా అద్భుతమైన విన్యాసాలను నమోదు చేసే విశ్వ నమోదు సంఘం(యూఆర్‌ఎఫ్) చెబుతోంది. ప్రపంచంలోనే అతిపొడవైన మహిళా మానవహారంగానూ ఈ విమెన్ వాల్ రికార్డులకెక్కనుందని గిన్నిస్ బుక్ జ్యూరీ తెలిపింది.