సినీనటి కీర్తి సురేష్.. జాతీయ ఉత్తమ నటి పురస్కారాన్ని తన అమ్మకు అంకితమిస్తున్నట్టు ప్రకటించారు. ఉత్తమ నటి పురస్కారం తనకు దక్కడం చాలా సంతోషంగా ఉందన్నారు. అవార్డు దక్కిన ఈ క్షణాన ఏం చెప్పాలో, ఎలా చెప్పాలో తనకు అర్థం కావడంలేదన్నారు. మహానటి చిత్రబృందం మొత్తానికి కృతజ్ఞతలు చెప్పారు. వారు లేకుండా తాను ఈ ఘనత సాధించడం సాధ్యం కాదన్నారు. వారందరికీ పేరుపేరునా కృతజ్ఞతలు తెలియజేశారు. తన జీవితంలో ఇదో అత్యుత్తమమైన అనుభూతి అని చెప్పారు. తన మాతృమూర్తి మేనకకు తొలి మలయాళం సినిమాకు జాతీయ అవార్డు రావాల్సిందని.. కానీ కొద్దిలో జారిపోయిందని గుర్తుచేసుకున్నారు. అందుకే ఆమెకు ఈ పురస్కారాన్ని అంకితమిస్తున్నట్టు వెల్లడించారు.
జాతీయ చలన చిత్ర పురస్కారాల్లో సావిత్రి జీవిత కథ ఆధారంగా తెరకెక్కిన మహానటి మూడు పురస్కారాలు గెలుచుకున్న విషయం తెలిసిందే. సావిత్రి పాత్రలో పరకాయ ప్రవేశం చేసిన కీర్తి సురేష్ జాతీయ ఉత్తమ నటి పురస్కారాన్ని కైవసం చేసుకున్నారు.