HomeTelugu Big Storiesతెలంగాణ ఆర్టీసీ సమ్మెపై కేసీఆర్ వ్యూహం ఏమిటి?

తెలంగాణ ఆర్టీసీ సమ్మెపై కేసీఆర్ వ్యూహం ఏమిటి?

 

3 11
తెలంగాణలో ఆర్టీసీ కార్మికుల సమ్మె ఉధృతంగా సాగుతోంది. సమ్మె విషయంలో అటు ప్రభుత్వం, ఇటు కార్మికులు ఏ మాత్రం వెనక్కి తగ్గడం లేదు. ప్రజలకు ఇబ్బంది లేకుండా సమ్మెకు విరుగుడుగా ప్రత్యామ్నాయ ఏర్పాట్లు చేయాలని ప్రభుత్వం ప్రయత్నిస్తుంటే.. తమ సమ్మెకు రాజకీయ పార్టీలు, ప్రజా సంఘాల మద్దతు కూడగట్టాలని ఆర్టీసీ జేఏసీ భావిస్తోంది. ఆర్టీసీ జేఏసీ, సీఎం కేసీఆర్ మధ్య సాగుతున్న ఈ కోల్డ్ వార్ కాస్త కేసీఆర్ వర్సెస్ కోదండరామ్‌గా మారిపోయిందనే టాక్ వినిపిస్తోంది. తెలంగాణలో ప్రస్తుతం ఆర్టీసీ జేఏసీని సమన్వయపరుస్తూ తెలంగాణ జన సమితి అధ్యక్షుడు కోదండరామ్ ముందుకు సాగుతుండడం విశేషం.

తెలంగాణ ఆర్టీసీ సమ్మెకు టీఎన్జీవో ఉద్యోగ సంఘాల మద్దతు కూడగట్టాలని కోదండరాం ప్రయత్నించారని ఈ విషయాన్ని ముందుగానే గ్రహించిన సీఎం కేసీఆర్ వారిని పిలిచి చర్చలు జరిపారని రాజకీయవర్గాల్లో చర్చ జరుగుతోంది. ఆర్టీసీ కార్మికుల సమ్మెకు కాంగ్రెస్‌తో పాటు బీజేపీ మద్దతును కూడగట్టడంతో పాటు ఇతర పార్టీల మద్దతు కూడా రావడంతో కోదండరాం కీలక పాత్ర పోషిస్తున్నారని తెలుస్తోంది. తెలంగాణ ఉద్యమం, సకల జనుల సమ్మె సమయంలో ఉద్యమాన్ని ఎక్కువ రోజులు కొనసాగించేలా వ్యూహరచన చేసిన కోదండరాం ఈ సారి తన అనుభవాన్ని ఆర్టీసీ కార్మికుల సమ్మె కోసం వినియోగిస్తున్నారనే ప్రచారం జరుగుతోంది. ఆర్టీసీ కార్మికుల సమ్మె విషయంలో కోదండరాం రంగంలోకి దిగారని తెలిసిన తరువాతే… సీఎం కేసీఆర్ కూడా ఈ మొత్తం అంశాన్ని సీరియస్‌గా తీసుకుని తన రాజకీయ వ్యూహాలకు పదునుపెట్టారని ప్రచారం జరుగుతోంది. మొత్తానికి తెలంగాణలో జరుగుతున్న ఆర్టీసీ ఉద్యోగుల సమ్మె మరోసారి కేసీఆర్ వర్సెస్ కోదండరాం అన్నట్టుగా ఉందంటున్నారు.

బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు కె.లక్ష్మణ్‌తో తెలంగాణ జన సమితి అధ్యక్షుడు కోదండరాం, ఆర్టీసీ జేఏసీ నేతలు అశ్వత్థామరెడ్డి, రాజిరెడ్డి శుక్రవారం సమావేశమయ్యారు. ఆర్టీసీ సమ్మెకు మద్దతు, భవిష్యత్ కార్యాచరణపై చర్చించేందుకు కోదండరాం నేతృత్వంలోని పార్టీ ప్రతినిధి వర్గం, అశ్వత్థామరెడ్డి, రాజిరెడ్డి నేతృత్వంలో ఆర్టీసీ జేఏసీ నేతలు బీజేపీ రాష్ట్ర కార్యాలయానికి వచ్చారు. వారిని లక్ష్మణ్ సాదరంగా ఆహ్వానించారు. అనంతరం కోదండరాం, ఆర్టీసీ జేఏసీ నేతలతో లక్ష్మణ్ సమావేశమయ్యారు. ఈ సమావేశంలో ఆర్టీసీ కార్మికుల న్యాయమైన డిమాండ్ల పరిష్కారం, అన్ని పార్టీలు, ఉద్యోగ సంఘాల మద్దతు, భవిష్యత్ కార్యాచరణపై చర్చించారు.

Recent Articles English

Gallery

Recent Articles Telugu