తెలంగాణలో సమ్మెకు దిగిన ఆర్టీసీ కార్మికులతో చర్చలు జరిపే ప్రసక్తే లేదని సీఎం కేసీఆర్ స్పష్టం చేశారు. 7 రోజులుగా సమ్మె జరుగుతున్న నేపథ్యంలో హైదరాబాద్‌లోని ప్రగతిభవన్‌లో రవాణా మంత్రి పువ్వాడ అజయ్‌తో పాటు రవాణా శాఖ అధికారులతో సమావేశమయ్యారు. ప్రత్యామ్నాయ ఏర్పాట్లపై సమీక్షించారు. రాష్ట్ర వ్యాప్తంగా బస్సులను పూర్తి స్థాయిలో నడపాలని ఆదేశించారు. కొత్తగా కండక్టర్లను, డ్రైవర్లను తాత్కాలిక ప్రాతిపదికన నియమించుకోవాలని, అద్దె బస్సులకు వెంటనే నోటిఫికేషన్ జారీ చేయాలని ఆదేశించారు. సమ్మెలో పాల్గొన్న వారిని ఎట్టి పరిస్థితుల్లోనూ విధుల్లోకి తీసుకోవద్దని మరోసారి స్పష్టం చేశారు. సమ్మెకు దూరంగా ఉన్నవారికి, విధుల్లో చేరిన వారికే సెప్టెంబర్ నెల జీతాలు ఇవ్వనున్నట్లు తెలిపారు. విద్యార్థులకు ఎలాంటి ఇబ్బందులు లేకుండా దసరా సెలవులు పొడిగించినట్లు తెలిపారు. ఆర్టీసీలో 30 శాతం బస్సులు అద్దె ప్రాతిపదికన నడుస్తాయని తెలిపారు.