తెలంగాణ సీఎం కేసీఆర్.. కరోనా వైరస్ నియంత్రణకు చేపట్టిన జనతా కర్ఫ్యూకు ప్రజలంతా అద్భుతమైన రీతిలో సంఘీభావం తెలిపారని అన్నారు. సంఘీభావ ఐక్యతను చాటిచెప్పిన ప్రతి ఒక్క తెలంగాణ బిడ్డకు ధన్యవాదాలు తెలుపుతున్నట్లు ఆయన పేర్కొన్నారు. ఈ రోజు తెలంగాణలో 5 కొత్త పాజిటివ్ కేసులు నమోదవడం దురదృష్టం అని చెప్పారు. కరోనా నివారణకు ఉన్నత స్థాయి కమిటీ చర్చించిందన్నారు. ఈనెల 31 వరకు ప్రజలంతా ఇళ్లకే పరిమితం కావాలని.. అప్పటి వరకు రాష్ట్ర వ్యాప్తంగా లాక్‌డౌన్ ప్రకటిస్తున్నట్లు సీఎం స్పష్టం చేశారు.
”ఇంటి అవసరాలకు సంబంధించి పాలు, కూరగాయల కోసం మాత్రమే బయటకు రావాలి. బయటకు వచ్చిన వ్యక్తులు పక్కవారితో కనీసం మూడు అడుగుల దూరం పాటించాలి. ఇక ప్రైవేట్ కంపెనీలలో పనిచేసే వ్యక్తులకు తప్పనిసరిగా ఈ వారానికి సంబంధించిన జీతం చెల్లించాలని సీఎం కేసీఆర్ ఆదేశాలు జారీ చేశారు. రాష్ట్రంలో 87.59 లక్షల రేషన్ కార్డులు ఉన్నాయి. ఒక్కో రేషన్‌కార్డుకు 12 కిలోల రేషన్ బియ్యం ఉచితంగా ఇస్తాం. బియ్యంతోపాటు ప్రతి రేషన్ కార్డుకు రూ.1500 నగదు అందజేస్తాం. ప్రభుత్వ ఉద్యోగులు అందరూ కార్యాలయాలకు రావాల్సిన అవసరం లేదు. అత్యవసర సర్వీసుల ఉద్యోగులు అందరూ హాజరుకావాల్సిందే. ఈనెలాఖరు వరకు అంతర్రాష్ట్ర సరిహద్దుతో పాటు ప్రజారవాణాను మూసివేస్తున్నాం, ఆర్టీసీ బస్సులు, ఆటోలు, ట్యాక్సీలు అనుమతించం. ఎట్టి పరిస్థితుల్లో అవి నడపడానికి వీలు లేదు. ప్రజలు గుమిగూడకూడదనే ఈ నియంత్రణ చర్యలు చేపడుతున్నాం. ఈ విపత్తు ఎదుర్కోవాలంటే స్వీయ నియంత్రణ తప్పదు. ఎవరి ఇళ్లకు వాళ్లు పరిమిత కావాలనేదే ప్రధాన నిర్ణయం. లేని ఇబ్బందులు కొనితెచ్చుకోవద్దు” అని కేసీఆర్ సూచించారు.
CM Sri K. Chandrashekar Rao addressing the media at Pragathi Bhavan. #CoronaVirus https://t.co/Pgi7XvOlbU
— Telangana CMO (@TelanganaCMO) March 22, 2020