తెలంగాణ సీఎం కేసీఆర్ మానవ ప్రపంచాన్ని అనేక ఇబ్బందులు, కష్టనష్టాలకు గురిచేస్తున్న కరోనా వైరస్.. తెలంగాణను కూడా పట్టి పీడిస్తోందని అన్నారు. ఈరోజు 11 పాజిటివ్ కేసులు నమోదయ్యాయని.. ఇప్పటి వరకు రాష్ట్రంలో 1096 పాజిటివ్ కేసులు నిర్ధారణ అయినట్లు చెప్పారు. దీనిలో ఈరోజు 43 మంది కోలుకోగా.. మొత్తంపై డిశ్చార్జ్ అయిన వారి సంఖ్య 628కి చేరుకుందన్నారు. ప్రస్తుతం ఆస్పత్రుల్లో 439 మంది చికిత్స పొందుతున్నారని ఆయన వివరించారు. కేబినెట్ 7 గంటల సుదీర్ఘ భేటీ ముగిసిన అనంతరం నిర్వహించిన మీడియా సమావేశంలో కేసీఆర్ మాట్లాడారు. మంత్రివర్గం తీసుకున్న నిర్ణయాలను ఆయన వెల్లడించారు. దేశంలోనే మొదటి కంటైన్‌మెంట్ జోన్‌గా ఉన్న కరీంనగర్‌ను కరోనా నుంచి కాపాడుకోగలిగామన్నారు. అక్కడ కరోనా నియంత్రణకు సహకరించిన అధికారులకు ఆయన అభినందనలు తెలిపారు.
”కరోనాను నమ్మడానికి వీల్లేదు.. కనిపించని శత్రువు. ప్రజలు తమకు తామే స్వీయనియంత్రణ పాటించాలి. ఎవరో బలవంతపెడితే పాటించాలనుకోవద్దు. తమని తామే రక్షించుకోవాలి. అమెరికాలో భారీగా మరణాలు సంభవించాయి. మనదేశంలోనూ కొన్ని రాష్ట్రాల్లో కేసుల తీవ్రత ఎక్కువగా ఉంది. భౌతిక దూరం పాటించి కొంత విజయం సాధించాం. ఏకైక ఆయుధం లాక్‌డౌన్. కొంచెం జాగ్రత్తగా ముందుకెళితే రాష్ట్రం ,సమాజం బాగుపడే అవకాశముంది. రాష్ట్రంలో లాక్‌డౌన్‌ను మే 29 వరకు పొడిగిస్తున్నాం. ప్రజలంతా సహకరించాలి. ఇప్పటికే వ్యాధులతో దీర్ఘకాలిక వ్యాధులతో బాధపడుతున్నవారు పదేపదే తిరిగే అవసరం లేకుండా మూడు నెలలకు అవసరమైన మందులు ఒకేసారి ఇవ్వాలని నిర్ణయించాం. వారికోసం సుమారు కోటి మాస్క్‌లు ఉచితంగా అందజేస్తాం” అని కేసీఆర్ తెలిపారు.
”రెడ్‌జోన్‌లో హైదరాబాద్, మేడ్చల్, రంగారెడ్డి జిల్లాలు ఉన్నాయి. ఇక్కడ జనసాంధ్రత ఎక్కువ. పరిస్థితి చాలా భయంకరంగా ఉంది. ఏమాత్రం రిస్క్ తీసుకోలేం. నిబంధనలు కఠినంగా అమలు చేస్తాం. మొత్తం కేసుల్లో ఈ మూడు జిల్లాల్లోనే 726 ఉన్నాయి. రాష్ట్ర వ్యాప్తంగా 29 మంది మృతిచెందితే 25 మంది ఇక్కడే చనిపోయారు. ఈ మధ్య వచ్చే కేసుల్లో దాదాపు అన్నీ జీహెచ్‌ఎంసీ పరిధిలోనే నమోదవుతున్నాయి. త్వరలో సూర్యాపేట, వికారాబాద్ రెడ్ జోన్ నుంచి ఆరెంజ్ జోన్‌లోకి రానున్నాయి. ముంబయిలో ఒక్కోరోజు భయంకరంగా కేసులు పెరిగాయి. ఆ దుస్థితి మనకు రావొద్దు. హైదరాబాద్ చల్లగా ఉండాలి. చైనా నుంచి వెనక్కి మళ్లే పెట్టుబడులు దక్షిణ భారతంలో హైదరాబాద్‌కే వచ్చే అవకాశముంది. ఈ నేపథ్యంలో హైదరాబాద్‌ను కాపాడుకోవాల్సిన అవసరముంది. ప్రపంచవ్యాప్తంగా ఇలాంటి వైరస్‌లు వచ్చినపుడు 70 రోజుల సైకిల్ పాటించినట్లయితే చాలా వరకు అది నియంత్రణలోకి వస్తుంది” అని సీఎం చెప్పారు.
”పదోతరగతి పరీక్షలను హైకోర్టు నిబంధనల మేరకు మేలోనే నిర్వహిస్తాం. కరోనా మనను వెంటాడుతూనే ఉంటుంది. యువ, పేద న్యాయవాదుల సంక్షేమానికి రూ.25కోట్లు కేటాయిస్తున్నాం. తెలంగాణ అభివృద్ధిలో కార్మికులు భాగస్వాములు.. వారి అభివృద్ధికి అవసరమైన అన్ని చర్యలు చేపడతాం. వలస కార్మికులను కడుపులో పెట్టుకుని కాపాడుకుంటాం. వలస కార్మికులు స్వస్థలాలకు వెళ్లేందుకు ఏర్పాట్లు చేస్తున్నాం. వారికోసం ప్రత్యేక రైళ్లు ఏర్పాటు చేస్తున్నాం. రాష్ట్రంలో చిల్లర రాజకీయాలు చేస్తున్నారు. కేసీఆర్ బతికున్నంత వరకు.. టీఆర్‌ఎస్ అధికారంలో ఉన్నంత వరకు రైతు బంధు యథాతథంగా కొనసాగిస్తాం. దీనిలో ఎలాంటి సందేహం అవసరం లేదు. రైతులకు నాణ్యమైన ఉచిత విద్యుత్ ఇచ్చే ఏకైక రాష్ట్రం తెలంగాణే. తెలంగాణలో ఉండేది రైతు రాజ్యమే”అని స్పష్టం చేశారు.