తెలంగాణలోని హుజూర్ నగర్ నియోజకవర్గ ఉపఎన్నికకు ఎన్నికల కమిషన్ ఈరోజు షెడ్యూల్ విడుదల చేసింది. షెడ్యూల్ విడుదలైన వెంటనే పార్టీల మధ్య విమర్శల యుద్ధం మొదలైంది. హుజూర్ నగర్ ఉప ఎన్నికకు టీఆర్‌ఎస్ అభ్యర్ధిగా సైదిరెడ్డి పేరును ఖరారు చేశారు తెలంగాణ సీఎం కేసీఆర్. గత ఎన్నికల్లో కాంగ్రెస్ చీఫ్ ఉత్తమ్ కుమార్‌రెడ్డిపై స్వల్ప ఓట్ల తేడాతో ఓడిపోయిన సైదిరెడ్డికి కేసీఆర్ మళ్లీ అవకాశమిచ్చారు. ఆంధ్ర ప్రాంతానికి చెందిన వ్యక్తికి టీఆర్ఎస్ పార్టీ టికెట్ ఇచ్చిందని టీపీసీసీ అధ్యక్షుడు ఉత్తమ్ కుమార్ రెడ్డి విమర్శించారు. హుజూర్ నగర్ అభివృద్ధి కోసం టీఆర్ఎస్ ఏం చేసిందో చెప్పాలని ఉత్తమ్ డిమాండ్ చేశారు. ఉప ఎన్నికలో కాంగ్రెస్ పార్టీ 30 వేల మెజార్టీతో గెలవడం ఖాయమని ఆయన అన్నారు. బంగారు తెలంగాణ చేస్తానని చెప్పిన కేసీఆర్ ఈ ఆరేళ్లలో రాష్ట్రాన్ని భ్రష్టు పట్టించారని మండిపడ్డారు.
హుజూర్ నగర్ లో కాంగ్రెస్ ను గెలిపించి కేసీఆర్ నియంతృత్వ పాలనకు చరమగీతం పలకాలని పిలుపునిచ్చారు. ఉప ఎన్నిక రాష్ట్రానికి మార్గదర్శకం కావాలని కాంగ్రెసుకు ఓటేసి ప్రజాస్వామ్యాన్ని కాపాడాలని పిలుపునిచ్చారు. మరో పక్క హుజూర్‌నగర్ ఉప ఎన్నికల్లో టీఆర్‌ఎస్ గెలుపు ఖాయమన్నారు ఆ టికెట్ దక్కించుకున్న సైదిరెడ్డి. ప్రధాన ప్రత్యర్థి కాంగ్రెస్సేనని, అభివృద్ధిని అజెండాగా తీసుకెళ్తామని అంటున్నారు. ఉత్తమ్‌ను హుజూర్‌నగర్ నుంచి పంపించేందుకే.. నల్గొండ ఎంపీగా గెలిపించారని సైదిరెడ్డి
చెబుతున్నారు.