ఏఐసీసీ అధ్యక్షుడు రాహుల్ గాంధీపై తెలంగాణ సీఎం కేసీఆర్ నిప్పులు చెరిగారు. ఎన్నికల ప్రచారంలో భాగంగా తెలంగాణలో పర్యటించిన రాహుల్ గాంధీ పలు సభల్లో కేసీఆర్‌పై పలు ఆరోపణలు చేశారు. ప్రాజెక్టుల రీడిజైన్ పేరుతో కేసీఆర్ తెలంగాణ సొమ్మును దోచుకున్నారని, కుటుంబం కోసమే కేసీఆర్ పాలన కొనసాగిస్తున్నారని రాహుల్ చేసిన విమర్శలపై కేసీఆర్ మండిపడ్డారు.
భద్రాద్రి కొత్తగూడెం జిల్లా ఇల్లెందు, కొత్తగూడెం, పినపాక నియోజకవర్గానికి సంబంధించి మణుగూరు, జయశంకర్ భూపాలపల్లి జిల్లా ములుగు, భూపాలపల్లి, పెద్దపల్లి, మంథని ప్రాంతాల్లో కేసీఆర్ ఎన్నికల సభల్లో పాల్గొన్నారు. రాహుల్ గాంధీకి భగవంతుడు తెలివి ఇచ్చాడో లేదో తెలియదు.. ఎవరు రాసిస్తున్నారో తెలియదు. ఆయన ఏం మాట్లాడుతున్నారో ఆయనకే అర్థం కావడంలేదు. మేము కమీషన్ల కోసం ప్రాజెక్టులను రీడిజైన్ చేశామట అంటూ దుయ్యబట్టారు. ప్రాజెక్టుల వద్దకు వస్తావా రాహుల్. మీ నాన్న పేరు మీద ఉన్న రాజీవ్‌సాగర్, ఇందిరాసాగర్ చరిత్ర చూద్దామా.. ఎందుకు రీడిజైన్ చేసి సీతారామగా పేరు మార్చుకున్నామో. దాని పురోగతి ఏమిటో? కాంగ్రెస్ హయాంలో మీ గులాంలు మీరు ఏది చెబితే అది విని పిచ్చి ప్రాజెక్టులు కట్టారు. వాటిని తీసి అవతల పడేసి మాకు అవసరమైనవి కట్టుకుంటున్నాం. మీకు తెలివిలేక కమీషన్‌ల కోసం మార్చారు అంటున్నారు. మీకు కమీషన్ కావాలా? రా ఇస్తాం. మీలాగా మాకు అవసరంలేదు అంటూ నిప్పులు చెరిగారు.
రాష్ట్రాన్ని ఆకుపచ్చని తెలంగాణగా మార్చాలన్న ధ్యేయంతో సాగునీటి ప్రాజెక్టులు నిర్మిస్తున్నామని.. అవసరమైనచోట రీడిజైన్ చేస్తున్నామని.. కమీషన్ల కక్కుర్తి కాంగ్రెస్ వారికేనని దుయ్యబట్టారు. కాంగ్రెస్ నాయకులకు వెన్నెముక లేదని, ఢిల్లీ వాళ్లొస్తేనే వీళ్లు లేస్తారని, లేకుంటే లేదని అన్నారు. రాహుల్ గాంధీ వస్తే భుజాన ఎత్తుకొని ఊరేగుతున్నారని ఎద్దేవా చేశారు. ప్రజాకూటమి మాయాకూటమి.. కిరికిరి రాజకీయాలు చేస్తోందని విమర్శించారు. దేశంలో ఎక్కడా అమలు కాని సంక్షేమ పథకాలు మన రాష్ట్రంలో అమలు చేస్తున్నామని సంపదను పెంచుకుంటూ ప్రజలకు పంచుతున్నామని కేసీఆర్ వివరించారు.