బుధవారం నిజామాబాద్‌లో జరిగిన ప్రజా ఆశీర్వాద సభలో ముఖ్యమంత్రి కేసీఆర్ కాంగ్రెస్‌పై నిప్పులు చెరిగారు. టీడీపీ తో కాంగ్రెస్ పొత్తుపై ఆయన తీవ్రస్థాయిలో మండిపడ్డారు. ఉద్యమాలతో కష్టపడి సాధించుకున్నతెలంగాణను మళ్లీ అమరావతికి తాకట్టు పెడతారా? అని ప్రశ్నించారు. తెలంగాణ ద్రోహి చంద్రబాబుతో కాంగ్రెస్ నేతలు పొత్తు పెట్టుకుంటారా? సిగ్గులేదా? అని ఆగ్రహం వ్యక్తంచేశారు. ఏడు మండలాలు, సీలేరు విద్యుత్ ప్రాజెక్టు దుర్మార్గంగా తీసుకున్న చంద్రబాబుతో పొత్తా అంటూ ధ్వజమెత్తారు. చంద్రబాబుతో పొత్తు పెట్టుకొని పోరాడి సాధించుకున్న తెలంగాణ ఆత్మగౌరవాన్ని అమరావతికి తాకట్టు పెడతారా? అని నిలదీశారు. ‘కాంగ్రెస్ వాళ్ల ప్రచారం కోసం చంద్రబాబు రూ.500 కోట్లు ఇస్తారట.. చంద్రబాబే ప్రచారానికి హెలికాఫ్టర్లు ఏర్పాటు చేస్తారట’ అంటూ కేసీఆర్ వ్యాఖ్యానించారు. అడుక్కుంటే తామే కాంగ్రెస్‌కు నాలుగు సీట్లు ఇచ్చేవాళ్లం కదా అంటూ తీవ్ర స్థాయిలో విమర్శలు గుప్పించారు. కాంగ్రెస్ నేతలు ఢిల్లీకి గులాంగిరీ చేస్తారని, ఆ గులాంలలో గులాంనబీ ఆజాద్ కూడా ఒకరనిఎద్దేవా చేశారు.
రాష్ట్రం సుభిక్షంగా ఉండాలంటే మళ్లీ టీఆర్‌ఎస్‌కే పట్టం కట్టాలని ముఖ్యమంత్రి కేసీఆర్ అన్నారు. నాలుగున్నరేళ్ల తమ పాలనలో అన్నిరంగాల్లో అభివృద్ధి సాధించామన్నారు. కాంగ్రెస్ నేతలు కోర్టు కేసులతో ఇబ్బందులు పెట్టడాన్ని సహించలేకే ముందస్తు ఎన్నికలకు వెళ్లామని చెప్పారు. కడుపు కట్టుకొని, నోరు కట్టుకొని అవినీతికి దూరంగా ఉండి పనిచేసిన కారణంగానే ఆర్థికంగా రాష్ట్రం దేశంలోనే తొలి స్థానంలో నిలిచిందని వివరించారు. హోంగార్డులు, అంగన్‌వాడీ వర్కర్లు, ఆశావర్కర్లు.. కాంట్రాక్టు ఉద్యోగులు, అర్దాకలితో పనిచేసే ఉద్యోగులకు జీతాలు పెంచామని గుర్తు చేశారు. ఉద్యోగుల విషయంలో కొందరు పిచ్చి మాటలు మాట్లాడుతున్నారని విమర్శించారు.టీఆర్‌ఎస్ ప్రభుత్వం 43శాతం ఫిట్‌మెంట్ ఇచ్చిన ఘనత తమదేనన్నారు. భవిష్యత్తులో ఉద్యోగులకు మంచి పెంపు ఉంటుందని, ఆందోళన అక్కర్లేదన్నారు.
రెప్పపాటు విద్యుత్‌కోత లేకుండా చేస్తానని అసెంబ్లీలో తాను ప్రకటించానని ఆనాడు చెప్పిన విషయాన్ని ముఖ్యమంత్రి మరోసారి గుర్తు చేశారు. అలా చేసినట్టయితే గులాబీ కండువా కప్పుకుంటానంటూ ప్రతిపక్ష నేత జానా రెడ్డి ప్రకటించిన విషయాన్ని ప్రస్తావించిన కేసీఆర్.. ఇప్పుడాయని తప్పించుకునే ప్రయత్నం చేస్తున్నారన్నారు.