ఆదివారం పరేడ్ గ్రౌండ్స్‌లో జరిగిన ప్రజా ఆశీర్వాద సభలో ఆయన పాల్గొని ప్రసంగించారు. హైదరాబాద్ విశ్వనగరమని, ఇది ఏ ఒక్కరి సొత్తూ కాదని తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్ అన్నారు. ఈ సందర్భంగా 24 అంశాలతో కూడిన మేనిఫెస్టోను విడుదల చేశారు. అనంతరం కేసీఆర్ మాట్లాడుతూ.. ‘హైదరాబాద్‌కు ఎప్పుడో తాతలు, తండ్రుల కాలంలో చేరుకున్నవారు చాలా మంది ఉన్నారు. వాళ్లు ఏ ప్రాంతీయులు అని చూడకుండా జీహెచ్‌ఎంసీ ఎన్నికల్లో కార్పొరేటర్‌గా పోటీ చేసేందుకు అవకాశం ఇచ్చాం. వాళ్లలో చాలా మంది గెలిచారు. ఇప్పుడు ఎమ్మెల్యేలుగా నిలబడిన వాళ్లు కూడా గెలవబోతున్నారు. ప్రాంతీయ భేదాలు టీఆర్ఎస్ పార్టీకి లేవు. చిల్లర రాజకీయాలు లేవు. ప్రజలను ప్రజలుగానే చూస్తున్నాం. హైదరాబాద్‌లో అన్ని ప్రాంతాల ప్రజలు నివశిస్తున్నారు. వారందరికీ కూడా నా విన్నపం ఒక్కటే. ‘మేము వేరు. ఆంధ్రా వాళ్లం’ అనే భావన వీడండి. హైదరాబాదీగా ఉండండి. హైదరాబాదీగా ఉన్నందుకు గర్వపడండి. కేసీఆర్ మీతో ఉన్నాడు. ఈ నగరానికి అంతర్జాతీయంగా ఒక బ్రాండ్ ఇమేజ్ ఉంది. నేను పాత మెదక్ జిల్లాకు చెందిన వాడిని.ఇక్కడకు వచ్చి ఉంటున్నా. అందరం ప్రశాంతంగా జీవిస్తున్నాం. చంద్రబాబు స్వార్థ రాజకీయాల కోసం వేరుగా మాట్లాడుతున్నారు. ఇంత కుట్ర చేయాలా? ఆయన పని చేసుకోవాలంటే 175 నియోజకవర్గాలు లేవా? 13 నియోజకవర్గాల్లో పోటీ చేసి ఏం సాధించగలరు? ఇటువంటి మకిలి రాజకీయాలెందుకు? ఆంధ్రా, రాయలసీమ ప్రాంత వాసులు ఆలోచించాలని నేను కోరుతున్నా’
హైదరాబాద్ మహానగరంలో తాగునీటి వ్యవస్థకు ఎలాంటి ఇబ్బందులు తలెత్తకుండా ఉండేందుకు రెండు రిజర్వాయర్ల నిర్మాణం చేపడుతున్నట్లు కేసీఆర్ చెప్పారు. మేడ్చల్ నియోజకవర్గంలోని కేశవాపూర్‌లో ఓ రిజర్వాయర్ పనులు ప్రారంభానికి సన్నాహాలు చేస్తున్నామని, మరొకటి రాచకొండ గుట్టల్లో 20 టీఎంసీల సామర్థ్యంతో నిర్మించనున్నట్లు కేసీఆర్ వివరించారు.