తెలుగు బిగ్‌బాస్ సీజన్-2 టైటిల్ కౌశల్ గెలుచుకున్న విషయం తెలసిందే. అయితే ఆయన గెలుపులో కౌశల్ ఆర్మీ కీలక పాత్ర పోషించింది. గెలిపించడమే కాదు దాదాపు ఈ రియాల్టీ షోను తమ గుప్పిట్లోకి తెచ్చుకుంది. సోషల్ మీడియా వేదికగా వీరు చేసిన హంగామ అంత ఇంత కాదు. తమ అభిమాన కంటెస్టెంట్ జోలికి వచ్చిన ఎవ్వరిని కూడా వదిలిపెట్టలేదు కౌశల్ ఆర్మీ. ఆఖరికి హోస్ట్ నానిని కూడా. ఒక్క తెలుగులోనే కాదు.. ఈ సోషల్ మీడియా వేదికగా ఏర్పాటైన ఆర్మీల ప్రభావం.. అటు తమిళం, మలయాళంలోను కనిపించింది. నిజానికి ఈ సీజన్ బిగ్‌బాస్‌ను సోషల్ మీడియానే శాసించింది. మూడు భాషల్లో తమ అభిమాన కంటెస్టెంట్స్ పేరిట ఏర్పాటైన ఆర్మీలే గేమ్ ఆడించాయి.
తెలుగులో కౌశల్ ఆర్మీ.. మళయాళంలో సబు ఆర్మీ, తమిళంలో రిత్వికా ఆర్మీలే పై చేయి సాధించాయి. మూడు భాషల్లో ఫైనల్ ఆదివారమే జరగగా.. మూడింట్లో ఈ ఆర్మీలే అంతిమ విజయం సాధించాయి. మలయాళంలో సబుమోన్ అబ్దుసమద్ టైటిల్ గెలవగా.. తమిళంలో రిత్వికా విజయం సాధించింది. ఇక ఫైనల్లో ఈ మూడు ఆర్మీ గ్రూప్‌లు ఒకరికి ఒకరు మద్దతుగా ప్రచారం చేసుకున్నాయి. భాషతో సంబంధం లేకుండా మీ అభిమాన కంటెస్టెంట్స్‌కు మేం ఓట్లేస్తున్నాం.. మీరు మాకేయ్యండి అని ఈ మూడు గ్రూప్‌లు క్యాంపెన్ నిర్వహించాయి. కాగా తమిళ బిగ్‌బాస్ సీజన్-1లో ఓవియా కంటెస్టెంట్‌కు మద్దతుగా తొలిసారి ఓవియా ఆర్మీ ఏర్పాటైంది. అక్కడి నుంచి తొలిసారి దక్షిణ భారత దేశంలో ఈ ఆర్మీ సంస్కృతి పుట్టుకొచ్చింది. కొన్ని కారణాల వల్ల ఓవియా ఆర్మీ ఆమెను గెలిపించలేకపోయింది. కానీ ఈ సారి ఏర్పాటైన ఆర్మీలు మాత్రం విజయవంతంగా తమ అభిమాన కంటెస్టెంట్స్‌ను గెలిపించాయి.