కార్తికేయ హీరోగా తెరకెక్కిన సినిమా ’90ఎంఎల్’. నేహా సోలంకి హీరోయిన్‌గా నటిస్తుంది. శేఖర్ రెడ్డి ఎర్రా దర్శకత్వం వహించారు. గురువారం ఈ సినిమా ట్రైలర్‌ను చిత్రబృందం సోషల్‌మీడియా వేదికగా విడుదల చేసింది. ‘నీతో కలిసి చచ్చేంత ప్రేమ నాలో ఉంది. నాతో కలిసి బతకాలనే ఆలోచనే నీలో లేదు’ అని నేహా చెప్పే డైలాగ్‌తో ఈ ట్రైలర్ ప్రారంభమవుతోంది.
ట్రైలర్‌లోని సన్నివేశాలను బట్టి చూస్తుంటే ఆరోగ్య పరిస్థితుల రీత్యా కార్తీకేయ చిన్నప్పటి నుంచి మద్యం తాగడం అవసరంగా మారుతుంది. కనుక ప్రతిరోజూ ’90 ఎంఎల్’ మద్యం తాగుతుంటాడు. మద్యం తాగేవారంటే ఇష్టంలేని నేహా ఈ విషయం తెలిసి ‘ఒక్కరోజు మందు తాగకపోతే చచ్చిపోతావా’ అని ప్రశ్నించగా.. ‘అవును.. చచ్చిపోతాను’ అని కార్తికేయ చెబుతాడు. ఎంతో ఆసక్తికరంగా ఉన్న ఈ ట్రైలర్ ప్రేక్షకులను ఆకట్టుకుంటోంది. రవి కిషన్, రావూ రమేష్, అలీ, పోసాని కృష్ణమురళి, అజయ్‌లు ఇతర కీలక పాత్రల్లో నటిస్తున్న ఈ చిత్రానికి అనూప్ రూబెన్స్ సంగీతమందిస్తున్నాడు. ఈ చిత్రం డిసెంబర్ 5న విడుదల కానుంది.