తమిళ స్టార్ హీరో కార్తీ నటించిన తాజా చిత్రం ‘జపాన్’. ఈ సినిమాలో కార్తీ లుక్ మరియు డైలాగ్ డెలివరీ చాలా కొత్తగా ఉన్నాయి. దీంతో టీజర్, ట్రైలర్‌లు కొత్తగా అనిపించాయి. దీంతో అందరికీ మూవీ మీద ఇంట్రెస్ట్ పెరిగింది. నవంబర్ 10న ఈ చిత్రం థియేటర్లోకి వచ్చింది. మరి ఈ సినిమా ఎలా ఉందో చూద్దాం.
హైద్రాబాద్‌లోని రాయల్ అనే అతి పెద్ద నగల షాపులో దొంగతనం జరుగుతుంది. రెండు వందల కోట్ల విలువైన నగలు ఎత్తుకెళ్తారు. అది జపాన్ (కార్తీ) చేశాడని పోలీసులు గుర్తిస్తారు. ఇక జపాన్ కోసం పోలీసులు వెతుకుతుంటారు. అప్పటికే దేశంలో జపాన్ మీద మోస్ట్ వాంటెడ్ అనే ముద్ర ఉంటుంది. కేరళ, కర్ణాటక ఇలా అన్ని రాష్ట్రాల పోలీసులు జపాన్‌ను పట్టుకోవాలని ప్రయత్నిస్తుంటారు. కానీ జపాన్‌కు అనుకూలంగా ఒక్క సాక్ష్యం కూడా దొరకదు. మామూలుగానే జపాన్‌కు బంగారం పిచ్చి.. తెరపై తనని తాను హీరోగా చూసుకోవాలనే పిచ్చితో ఉంటాడు. అందుకే తనకు ఇష్టమైన సంజు (అను ఇమాన్యుయేల్)ను హీరోయిన్‌గా పెట్టి సినిమా తీసి గోల్డెన్ స్టార్ అవుతాడు జపాన్. రెండు వందల కోట్ల రాబరీ కేసులో జపాన్ ఎలా చిక్కుకుంటారు? ఆ దొంగ తనం చేసింది ఎవరు? చివరకు జపాన్ ఏమవుతాడు? అసలు జపాన్ ఫ్లాష్ బ్యాక్ ఏంటి? దొంగగా ఎందుకు మారతాడు? అన్నది థియేటర్లో చూడాల్సిందే.
కార్తీ గెటప్, డైలాగ్ డెలివరీ తప్పా ఏమీ కూడా కొత్తగా అనిపించదు. ఆసక్తికరంగా సాగదు. ఏ ఒక్క ఎమోషన్‌తోనూ కనెక్ట్ కాలేము. జపాన్‌కు హెచ్ఐవీ అని చెప్పి అదొక లైన్‌తో నీతి చెప్పే ప్రయత్నం చేసినట్టుగా అనిపిస్తుంది. ఎయిడ్స్ వచ్చిందని తెలియడంతో తన దగ్గర పని చేసే వ్యక్తి ఎలా టర్న్ తీసుకుంటాడు?.. ఎలా మోసం చేస్తాడు? అనే విషయాన్ని తెలుసుకుంటాడు జపాన్. మోసం చేస్తుందని భ్రమపడ్డ సంజు అసలు ప్రేమను మరో సందర్భంలో అర్థం చేసుకుంటాడు జపాన్. ఎయిడ్స్ ఉందని తెలిసినా తనతో శృంగారంలో పాల్గొనేందుకు సమ్మతం తెలిపి తన ప్రేమను చాటుకుంటుంది సంజు.
కానీ సంజు, జపాన్‌ల లవ్ ట్రాక్‌కు జనాలు ఏ మాత్రం కనెక్ట కాలేరేమో అనిపిస్తుంది. అసలు ఈ చిత్రంలో ఏ ఎమోషన్‌కి కూడా కనెక్ట్ కాలేకపోతారేమో. తల్లి సెంటిమెంట్‌ను వర్కౌట్ చేయాలని ప్రయత్నించారు. సినిమా చూస్తున్నంత సేపు ఏదో అసంతృప్తి వెంటాడుతూనే ఉన్నట్టుగా అనిపిస్తుంది. ప్రథమార్దం ఏదో అలా సో సోగా వెళ్తూ చిల్ అయినట్టుగానే ఉంటుంది.. కానీ రెండో భాగం కూడా అలానే నీరసంగా, నిరాసక్తికరంగా ముందుకు వెళ్తుంది. క్లైమాక్స్ కాస్త డిఫరెంట్‌గా అనిపిస్తుంది. ఎమోషనల్‌గా ముగుస్తుంది.
కార్తీ ఈ చిత్రాన్ని ఒక్కడే తన భుజాన మోసినట్టుగా అనిపిస్తుంది. సునీల్ పాత్ర కొన్ని సార్లు సీరియస్‌గా అనిపిస్తుంది. ఇంకొన్ని సార్లు కామెడీగా కనిపిస్తుంది. అను ఇమాన్యుయేల్ పాత్రకు ఇంపార్టెన్స్ లేదనిపిస్తుంది. కనిపించేది కూడా కొద్ది సేపే. కేఎస్ రవికుమార్, రాజేష్ అగర్వాల్ ఇలా మిగిలిన పాత్రలన్నీ ఓకే అనిపిస్తాయి. సాంకేతికంగా చూస్తే.. మాటలు కొన్ని చోట్ల నవ్విస్తాయి. ఇంకొన్ని చోట్ల ఆలోచింపజేస్తాయి. పాటలు ఏమంత ప్రభావాన్ని చూపించవు. విజువల్స్ బాగుంటాయి. ఎమోషనల్‌గా కనెక్ట్ కాకపోవడం వల్లే నిడివి కూడా సమస్యగానే అనిపిస్తుంది. నిర్మాణ విలువలు పర్వాలేదనిపిస్తాయి.
టైటిల్ : జపాన్
నటీనటులు: కార్తీ,అను ఇమాన్యుయేల్,సునీల్,కే ఎస్ రవి కుమార్ తదితరులు
దర్శకత్వం:రాజ్ మురుగన్