టాలీవుడ్ యంగ్ హీరో కార్తికేయ ఓ ఇంటివాడయ్యాడు. తన ప్రియురాలు లోహిత మెడలో మూడుముళ్లు వేశాడు. ఆదివారం ఉదయం హైదరాబాద్‌లోని ఓ ఫంక్షన్ హాల్‌లో కుటుంబసభ్యులు, సన్నిహితుల సమక్షంలో వీరి వివాహ వేడుక ఎంతో ఘనంగా జరిగింది. ఈ వేడుకలో మెగాస్టార్ చిరంజీవి, అల్లు అరవింద్, తణికెళ్ల భరణి, అజయ్ భూపతి, పాయల్ రాజ్‌పుత్‌తోపాటు పలువురు సినీ ప్రముఖులు పాల్గొని నూతన వధూవరులను ఆశీర్వదించి.. అభినందనలు తెలిపారు. దీనికి సంబంధించిన కొన్ని ఫొటోలు ప్రస్తుతం సోషల్ మీడియాలో చక్కర్లు కొడుతున్నాయి.
బీటెక్ చదువుతున్న రోజుల్లోనే కార్తికేయకు లోహితతో పరిచయం ఏర్పడింది. అనంతరం వీరిద్దరూ మనసులు ఇచ్చిపుచ్చుకున్నారు. ఈ క్రమంలోనే హీరోగా రాణించాలనే ఉద్దేశంతో కార్తికేయ ఇండస్ట్రీలోకి అడుగుపెట్టారు. ‘ఆర్‌ఎక్స్ 100’తో మొదటి ప్రయత్నంలోనే మంచి మార్కులు కొట్టేసి.. ప్రస్తుతం వరుస సినిమాల్లో నటిస్తున్నారు. ఇటీవల ఆయన నటించిన ‘రాజా విక్రమార్క’ చిత్రం బాక్సాఫీస్ వద్ద మిశ్రమ స్పందనలు అందుకుంది. అజిత్ హీరోగా నటించిన ‘వలిమై’ చిత్రంలో కార్తికేయ కీ రోల్ పోషించారు.