దివంగత నటుడు, కన్నడ పవర్ స్టార్ పునీత్ రాజ్ కుమార్ కు అరుదైన గౌరవం దక్కింది. ఆయన చేసిన సేవల్ని గుర్తించిన కర్ణాటక రాష్ర్ట ప్రభుత్వం ప్రతిష్ఠాత్మక అవార్డు ‘కర్ణాటక రత్న’ను ప్రకటించింది. ఈ మేరకు ముఖ్యమంత్రి బసవరాజు బొమ్మై ట్వీట్ చేశారు. పునీత్ తరఫున ఆయన కుటుంబ సభ్యులు ఈ అవార్డును స్వీకరించనున్నారు. ఈ అవార్డు ప్రకటనపై పునీత్ అభిమానులు, సినీ, రాజకీయ ప్రముఖులు సామాజిక మాధ్యమాల వేదికగా హర్షం వ్యక్తం చేస్తున్నారు.
కార్డియక్ అరెస్ట్‌తో అక్టోబరు 29 పునీత్ మరణించారు. నటుడిగా అలరిస్తూనే ఎన్నో సేవా కార్యక్రమాలు చేసి ప్రేక్షకుల హృదయాల్లో చిరస్థాయిగా నిలిచారు. వందలాది మందికి విద్యాదానం చేయడంతో పాటు ఆపదలో ఉన్న వారిని ఆదుకుంటూ ఆపద్బాంధవుడయ్యారు. అనాథశ్రమాలు, గోశాలలు నిర్వహించారు. సమాజం కోసం పునీత్ చేసిన కృషిని గుర్తించి ‘కర్ణాటక రత్న’, ‘బసవ పురస్కార’ అవార్డులు ఇవ్వాలని కోరుతూ సీఎంకు పునీత్ అభిమానులు ఇటీవల లేఖలు రాశారు. పలువురు మంత్రులు సైతం ఇదే విషయాన్ని కోరారు. దీనిపై సానుకూలంగా స్పందించిన సీఎం ‘కర్ణాటక రత్న’ అవార్డుతో పునీత్‌ను గౌరవించాలని మంగళవారం నిర్ణయించారు.
ಕನ್ನಡನಾಡಿನ ಜನಪ್ರಿಯ ಕಲಾವಿದ ದಿವಂಗತ ಶ್ರೀ ಪುನೀತ್ ರಾಜಕುಮಾರ್ ಅವರಿಗೆ ಮರಣೋತ್ತರ ಕರ್ನಾಟಕ ರತ್ನ ಪ್ರಶಸ್ತಿ ನೀಡಿ ಗೌರವಿಸಲು ರಾಜ್ಯ ಸರ್ಕಾರ ತೀರ್ಮಾನಿಸಿದೆ.
State Government has decided to honour late Sri #PuneethRajukumar with Karnataka Ratna award posthumously.#KarnatakaRatna
— Basavaraj S Bommai (@BSBommai) November 16, 2021