ప్రస్తుతం సినిమా ఇండస్ట్రీలో బయోపిక్‌ల ట్రెండ్ నడుస్తుంది. ప్రముఖుల జీవితకథల ఆధారంగా తెరకెక్కించి ఈ సినిమాలు డైరెక్టర్‌లకు మంచి హిట్ తెచ్చిపెడుతున్నాయి. తాజాగా భారత్ తరఫున ఒలింపిక్స్ లో పతకం సాధించిన తొలి తెలుగు మహిళగా రికార్డు సృష్టించిన వెయిట్ లిఫ్టర్ కరణం మల్లీశ్వరి జీవిత చరిత్ర ఆధారంగా ఓ బయోపిక్ ను తెరకెక్కించనున్నట్టు నిర్మాత కోన వెంకట్ తన ట్విట్టర్ ఖాతాలో వెల్లడించారు. 2000 సంవత్సరంలో ఒలింపిక్స్ లో మల్లీశ్వరి భారత ఖ్యాతిని దిగంతాలకు వ్యాపింపజేసిన సంగతి తెలిసిందే.
కాగా, నేడు కరణం మల్లీశ్వరి పుట్టిన రోజు కాగా, మరో నిర్మాత ఎంవీవీ సత్యనారాయణతో కలిసి ఎంవీవీ సినిమా, కేఎఫ్సీ (కోనా ఫిల్మ్ కార్పొరేషన్) ఈ సినిమాను నిర్మించనున్నట్టు కోన వెంకట్ తెలిపారు. ఇది పాన్ ఇండియా చిత్రం అని ఆయన స్పష్టం చేశారు. సినిమాలో కరణం మల్లీశ్వరి పాత్రను చేసే హీరోయిన్ ఎవరన్న విషయమై ఆయన ఎటువంటి స్పష్టతనూ ఇవ్వలేదు. ఈ సినిమాకు సంజనా రెడ్డి దర్శకత్వం వహిస్తున్నారు.