బాలీవుడ్ యంగ్ హీరో సుశాంత్ సింగ్ రాజ్ పుత్ మరణంతో ఇండస్ట్రీలోని పలువురు ప్రముఖులపై సోషల్ మీడియా వేదికగా పెద్ద ఎత్తున ఆరోపణలు వస్తున్న విషయం తెలిసిందే. ఈ నేపధ్యంలో ఇండస్ట్రీ మాఫియా, నెపోటిజం పై నెటిజన్లు విమర్శలు చేస్తున్నారు. కరణ్ జోహార్ సల్మాన్ ఖాన్ ఆలియా భట్ మహేష్ భట్ సోనమ్ కపూర్ కరీనా కపూర్ వంటి బాలీవుడ్ స్టార్స్‌పై సోషల్ మీడియాలో తీవ్ర వ్యతిరేకత వ్యక్తం అవుతోంది. ఈ క్రమంలో వారి నుండి వచ్చే చిత్రాలను బాయ్ కాట్ చేయాలని పోస్టులు చేస్తున్నారు. ముఖ్యంగా దర్శక నిర్మాత కరణ్ జోహార్ పై తీవ్ర స్థాయిలో విరుచుకుపడుతున్నారు. ఇండస్ట్రీకి చెందిన కుటుంబాల వారసులని పరిచయం చేస్తూ వారినే ప్రోత్సహిస్తుంటాడని.. బయట నుంచి వచ్చే యంగ్ టాలెంటెడ్ నటులను అణిచివేస్తారనే విమర్శలు చేస్తున్నారు. అంతేకాకుండా సుశాంత్ సింగ్ రాజ్ పుత్ మరణానికి పరోక్షంగా కారణమైన వారిలో కరణ్ కూడా ఒకరని కామెంట్స్ చేస్తున్నారు.
కరణ్ జోహార్ ప్రొడక్షన్ లో సుశాంత్ ‘డ్రైవ్’ అనే సినిమాలో నటించాడు. జాక్వలిన్ ఫెర్నాండేజ్ హీరోయిన్ గా నటించిన ఈ సినిమా ఎవరూ ఊహించని విధంగా గతేడాది థియేటర్స్ లో కాకుండా నేరుగా ఓటీటీలో విడుదల చేశారు. సుశాంత్ సినిమా ఓటీటీలో రిలీజ్ చేయడం అప్పట్లో చర్చనీయాంశం అయింది. ఉద్దేశపూర్వకంగానే సుశాంత్ కెరీర్ ను దెబ్బ తీయడానికి కరణ్ కుట్ర పన్నారనే విమర్శలు కూడా వచ్చాయి. అంతేకాకుండా కరణ్ జోహార్ ‘కాఫీ విత్ కరణ్’ షో లో కావాలనే ప్రతి ఒక్క సెలబ్రిటీని తాను అడిగే ప్రశ్నలలో సుశాంత్ ని ఇన్వాల్వ్ చేస్తూ అతన్ని తక్కువ చేసేలా చూస్తాడని కామెంట్స్ చేశారు. ఈ క్రమంలో అదే స్థాయిలో ఇప్పుడు కరణ్ జోహార్ ట్రోల్ల్స్ ఎదుర్కొంటున్నాడు.
ఈ విమర్శలతో కరణ్ తీవ్రంగా కలత చెందినట్లు అతడి సన్నిహితుడు వెల్లడించారు. బాలీవుడ్ హంగామాతో కరణ్ మిత్రుడు మాట్లాడుతూ.. సుశాంత్ ఆత్మహత్య తరువాత ఎదుర్కొన్న విమర్శలతో కరణ్ తీవ్ర మనస్తాపానికి గురైనట్లు తెలిపారు. ‘కరణ్ తీవ్రంగా కలత చెందాడు. సుశాంత్‌తో ఎలాంటి సంబంధంలేని అనన్య పాండేకు కూడా విమర్శలు తప్పలేదు. సుశాంత్ ఆత్మహత్యకు పరిహారంగా నువ్వు కూడా బలవన్మరణానికి పాల్పడాలంటూ సామాజిక మాధ్యమాల్లో నిందించారు’ అని పేర్కొన్నాడు. మరి ఈ విమర్శలపై కరణ్ ఎందుకు స్పందించడం లేదు అనే ప్రశ్నకు సమాధానమిస్తూ ‘ఇలాంటి పరిస్థితుల్లో స్పందించకుండా ఉండటమే ఉత్తమం అని అతడి లాయర్ సూచన మేరకే కరణ్ ఇప్పటివరకు ఏం మాట్లాడలేదు. అతడు మాట్లాడే పరిస్థితిలో కూడా లేడు. నేను ఏం తప్పు చేశానంటూ కుంగిపోతూ ఏడుస్తూనే ఉన్నాడు. అతడు విధికి బలైన వ్యక్తిలా అనిపిస్తున్నాడు’ అని అన్నాడు.