మలయాళ అగ్రహీరో మోహన్ లాల్, ప్రియదర్శన్ కాంబినేషన్లో రూపొందిన క్రైమ్ థ్రిల్లర్ ‘ఒప్పం’. ఈ చిత్రం మలయాళంలో అన్నివర్గాల ప్రేక్షకులను ఆకట్టుకుని సెన్సేషన్ క్రియేట్ చేసింది. మలయాళంలో ఒప్పం చిత్రం 50 కోట్లుకు పైగా వసూలు చేసి సరికొత్త రికార్డ్ క్రియేట్ చేసింది. మలయాళంలో సంచలనం సృష్టించిన ఒప్పం చిత్రాన్ని కన్నడలో శివరాజ్ కుమార్, హిందీలో అజయ్ దేవగన్ రీమేక్ చేస్తున్నారు. ఇక తెలుగులో ఈ చిత్రాన్ని దిలీప్ కుమార్ బొలుగోటి సమర్పణలో మోహన్ లాల్ నిర్మాతగా ‘కనుపాప’ అనే టైటిల్ తో తెలుగు ప్రేక్షకులకు అందిస్తుండడం విశేషం. ఈ చిత్రం ఆడియోను ఈనెల 25న రిలీజ్ చేయటానికి సన్నాహాలు చేస్తున్నారు. ప్రముఖ హీరో కనుపాప ఆడియోను రిలీజ్ చేయనున్నారు. ఇక చిత్రాన్ని ఫిబ్రవరి 3న విడుదల చేయనున్నారు. ఈ సందర్భంగా..
మోహన్ లాల్ మాట్లాడుతూ.. ”ఈ చిత్రంలో నేను అంధుడిగా నటించాను. ఫిబ్రవరి 3న కనుపాప చిత్రాన్ని రిలీజ్ చేయనున్నాం. మలయాళంలో ఒప్పం చిత్రాన్ని ఆదరించినట్టే తెలుగులో కనుపాప చిత్రాన్ని ఆదరిస్తారని ఆశిస్తున్నాను” అన్నారు.
చిత్ర సమర్పకుడు దిలీప్ కుమార్ బొలుగోటి మాట్లాడుతూ.. ”ఒప్పం చిత్రాన్ని మోహన్ లాల్ గారితో తెలుగు ప్రేక్షకులకు అందించే అవకాశం నాకు రావడం ఆనందంగా ఉంది. మోహన్ లాల్ నిర్మాతగా అందిస్తున్న ఈ చిత్రానికి నేను సమర్పకుడిగా వ్యవహరిస్తుండడం చాలా హ్యాపీగా ఫీలవుతున్నాను. ఈనెల 25న ఆడియో రిలీజ్ చేసి ఫిబ్రవరి 3న ఈ చిత్రాన్ని గ్రాండ్ గా రిలీజ్ చేసేందుకు ప్లాన్ చేస్తున్నాం. మలయాళంలో కంటే పెద్ద విజయాన్ని తెలుగులో సాధిస్తుందనే నమ్మకం ఉంది” అన్నారు.