కన్నడ సూపర్‌స్టార్ పునీత్ రాజ్‌కుమార్ ఇక లేరు. ఆయన శుక్రవారం (అక్టోబర్ 29) గుండెపోటుతో బెంగళూరులోని విక్రమ్ ఆసుపత్రిలో చేరారు. జిమ్ చేస్తూ గుండెపోటుకు గురైన ఆయనను ఇంటెన్సివ్ కేర్ యూనిట్ (ఐసీయూ)లో ఉంచి చికిత్స అందించారు వైద్యులు. పరిస్థితి విషమంగా మారడంతో ఈరోజు ఆసుపత్రిలోనే కన్నుమూశారు. పునీత్ వయసు 46. ఆయన ఇంత చిన్న వయసులోనే గుండెపోటు బారిన పడి కన్నుమూయడం సెలబ్రిటీలతో పాటు ఆయన అభిమానులను కూడా దిగ్భ్రాంతికి గురి చేసింది.
ఆయన పరిస్థితి విషమంగా ఉందని తెలియడంతో ఈరోజు మధ్యాహ్నమే విక్రమ్ ఆసుపత్రికి వెళ్ళి పునీత్ రాజ్ కుమార్ కుటుంబ సభ్యులను పరామర్శించారు కర్ణాటక ముఖ్యమంత్రి బసవరాజ్ ఎస్ బొమ్మై. యష్ వంటి పలువురు ప్రముఖులు ఆసుపత్రిలో ఆయన కుటుంబ సభ్యులను పరామర్శించారు. ఆయన మృతిపై అభిమానులు, ప్రముఖులు సోషల్ మీడియా వేదికగా సంతాపం వ్యక్తం చేస్తున్నారు.
కాగా 1976లో బాలనటుడిగా కెరీర్ ప్రారంభించిన పునీత్… 1989 వరకు బాలనటుడిగా 13 సినిమాలు చేశారు. ఉత్తమ బాలనటుడిగా నేషనల్ అవార్డును సంపాదించుకున్నారు. 2002లో అప్పూ సినిమాతో హీరోగా ఎంట్రీ ఇచ్చిన ఆయన.. హీరోగా ఇప్పటివరకు 32 సినిమాల్లో నటించారు.