ఆంధ్రప్రదేశ్ రాజకీయాల్లో బీజేపీ, వైసీపీ నాయకుల మధ్య మాటల యుద్ధం పెద్ద దుమారాన్ని రేపింది. పరస్పరం వ్యక్తిగత దూషణలకు దిగారు. కరోనా వ్యాధి నిర్ధారణకు వాడే ర్యాపిడ్ టెస్టు కిట్ల కొనుగోలులో గోల్‌మాల్ జరిగిందని ఏపీ బీజేపీ అధ్యక్షుడు కన్నా లక్ష్మీనారాయణ ఆరోపించగా.. దానికి వైసీపీ ఎంపీ విజయసాయిరెడ్డి తీవ్ర స్థాయిలో మండిపడుతూ చంద్రబాబుకు రూ.20 కోట్లకు అమ్ముడు కన్నా లక్ష్మీనారాయణ పోయారని ఆరోపించారు. దీంతో కాణిపాకం ఆలయానికి వచ్చి దేవుడి ముందు ప్రమాణం చేసే దమ్ము విజయసాయికి ఉందా అని కన్నా లక్ష్మీనారాయణ సవాలు విసిరారు. కన్నా సవాలును స్వీకరించిన విజయసాయిరెడ్డి ప్రమాణం చేస్తానని అన్నారు. లాక్‌డౌన్ ముగిశాక ప్రమాణానికి డేట్ ఫిక్స్ చేస్తానని విజయసాయిరెడ్డి మాటమీద నిలబడాలని ప్రమాణం చేయడానికి రావాలని కన్నా మరోసారి సవాలు విసిరారు.
ఇవాళ కన్నా లక్ష్మీనారాయణ మీడియా సమావేశం ఏర్పాటు చేశారు. బిజెపిని నిర్వీర్యం చేయాలని విజయసాయిరెడ్డి ప్రయత్నిస్తున్నారని కన్నా ఆరోపించారు. రాష్ట్రంలో వైసీపీ గ్రాఫ్ రోజురోజుకు పడిపోతుందని అన్నారు. లాక్‌డౌన్ సమయంలో కూడా విజయసాయిరెడ్డి రాష్ట్రం దాటి ఇష్టం వచ్చినట్లు తిరుగుతున్నారన్న వైకాపా నేతలు ఇష్టారాజ్యంగా
తిరగటం వల్లే కరోనా వైరస్ సామాజిక వ్యాప్తి దిశగా సాగుతోందని అన్నారు. ప్రజలను కట్టడి చేసిన ప్రభుత్వం విజయసాయిరెడ్డిని ఎందుకు నియంత్రించటం లేదని ప్రశ్నించారు.
ఎన్నికల్లో డబ్బు పంచే సంస్కృతి బీజేపీది కాదని అన్నారు. వైసీపీ నాయకులు ఎన్నికల్లో డబ్బులు పంచి గెలిచారని, అందరూ వారిలాగే ఉంటారని అనుకుంటున్నారని అన్నారు. పచ్చ కామెర్లు వచ్చిన వారికి లోకమంతా పచ్చగా కనిపించడం మామూలే అన్నారు. మీ మాదిరిగా కులం, కుటుంబం, అవినీతి బిజెపికి లేదని అన్నారు. కిట్లు
విషయంలో రేట్ల తేడా గురించి మాట్లాడితే నాపై వ్యక్తిగత ధూషణలు చేస్తున్నారని, గుమ్మడికాయల దొంగ అంటే విజయసాయి రెడ్డి భుజాలు తడుముకుంటున్నారని అన్నారు. వైసీపీ నేతలు తప్పు చేశారు కాబట్టే విషయాన్ని పక్కదారి పట్టించే ప్రయత్నం చేస్తున్నారని అన్నారు.
వైసీపీ నేతలు అధికార మదంతో మాట్లాడుతున్నారని ఆరోపించారు. రాజధాని విశాఖపట్నం వెళ్తుందా లేదా అనేది కాలమే నిర్ణయిస్తుందని కన్నా అన్నారు. చంద్రబాబు నుంచి నాకు రూ. 20 కోట్లు ముట్టాయని ప్రమాణం చేయాలని, లాక్ డౌన్ ముగియగానే తేదీ నిర్ణయిస్తామని కన్నా అన్నారు. ప్రతివారం కోర్టుకు వెళ్లి భగవద్గీత మీద ప్రమాణం చేయటం విజయ సాయికి అలవాటేనని అలాగే కాణిపాకంలో ప్రమాణం
చేసేందుకు రావాలని కన్నా అన్నారు.