బాలీవుడ్ క్వీన్ కంగనా రనౌత్ ఇంటికి సమీపంలో తుపాకీ కాల్పులు కలకలం రేపాయి. ప్రస్తుతం కంగనా మనాలీలో సెల్ఫ్ క్వారంటైన్‌లో ఉంటున్న సంగతి తెలిసిందే. శుక్రవారం రాత్రి తన ఇంటికి సమీపంలో తుపాకీ గుళ్లు పేల్చిన శబ్దం వినిపించినట్లు శనివారం ఉదయం పోలీసులకు ఫిర్యాదు చేశారు కంగనా రనౌత్. తన ప్రాణాలకు ముప్పు ఉన్నట్టు భావిస్తున్నట్టు ఫిర్యాదులో పేర్కొన్నారు. స్థానికులకు డబ్బు ఆశ చూపించి ఎవరో తనను బెదిరించడానికి ప్రయత్నిస్తున్నట్లుగా కంగన ఆరోపించారు. దీంతో కులూ జిల్లా పోలీసులు సంఘటనా స్థలానికి చేరుకొని కంగనా ఇంటికి సమీపంలో తనిఖీలు నిర్వహించారు. ఆ ప్రాంతంలో బందోబస్తు ఏర్పాటు చేశారు. కంగన రనౌత్ ఫిర్యాదుతో పోలీసులు దర్యాప్తు చేపట్టారు. అర్ధరాత్రి వినిపించిన శబ్దాలు తుపాకీ శబ్దాలేనా అనే కోణంలో ఆ ప్రాంతంలోని స్థానికులను విచారిస్తున్నారు. మనాలీకి వచ్చిన వాహనాల తనిఖీతో పాటు అనుమానాస్పద వ్యక్తులను ప్రశ్నిస్తున్నట్లు స్థానిక పోలీసులు వెల్లడించారు.