పశ్చిమ బెంగాల్‌లో ఎన్నికల ఫలితాల అనంతరం హింసాత్మక ఘటనలు చోటుచేసుకున్నాయి. పలుచోట్ల టీఎంసీ కార్యకర్తలు దాడులకు పాల్పడ్డారని తమ పార్టీకి చెందిన ఆరుగురు కార్యకర్తలు ఘర్షణల్లో మృతిచెందారని బీజేపీ ఆరోపించింది. పలుచోట్ల బీజేపీ మద్దతుదారుల షాపులు లూఠీ చేశారని తెలిపింది. మరోవైపు టీఎంసీ కూడా తమ కార్యకర్తలపై బీజేపీ దాడులకు పాల్పడిందని ఆరోపించింది. కొన్నిచోట్ల పోలీసులు బీజేపీ కార్యకర్తల్లా పనిచేశారని టీఎంసీ ఆరోపించింది. బెంగాల్‌లో తృణమూల్ కాంగ్రెస్ తిరుగులేని విజయం సాధించిన సంగతి తెలిసిందే.
టీఎంసీ సంబరాల్లో భాగంగా హింసాత్మక ఘటనలపై స్పందిస్తూ నటి కంగనా రనౌత్ తీవ్ర విమర్శలు చేసింది. ట్విట్టర్ వేదికగా సీఎం మమతా బెనర్జీపై తీవ్రంగా విరుచుకుపడింది. గతంలో ఆమెను రావణాసురుడితో పోల్చాను కానీ రావణుడు గొప్ప విధ్వాంసుడు, జ్ఞానవంతుడు, పరిపాలనాదక్షుడు.. ఈమె రక్త పిశాచి అంటూ విమర్శలు గుప్పించింది. మమతకు ఓటు వేసినవారందరికీ ఆ రక్తపు మరకలు అంటుకుంటాయి అంది. కంగనా వ్యాఖ్యలను తీవ్రంగా పరిగణించిన ట్విట్టర్ ఆమె ఖాతాను సస్పెండ్ చేసింది. ట్విట్టర్ చర్యలను ఖండిస్తూ వేరే మాధ్యమాల ద్వారా తన భావాలను ప్రజలకు తెలియజేస్తానంది. గత రెండు రోజులుగా బెంగాల్ జరుగుతున్న పరిణామాలను బీజేపీ అనుబంధం సంస్థలు, నెటిజన్లు బెంగాల్ బర్నింగ్, బెంగాల్ వయొలెన్స్ హ్యాష్ ట్యాగ్స్ తో సోషల్ మీడియాలో ప్రచారం చేస్తున్నారు.