విలక్షణ నటుడు కమల్ హాసన్ దర్శకత్వంలో 2000 సంవత్సరంలో తెరకెక్కించిన ‘హే రామ్’ చిత్రం 20 ఏళ్లు పూర్తి చేసుకుంది. ఈ సందర్భంగా కమల్ హాసన్ ఓ ట్వీట్ చేశారు. ఈ సినిమాలో షారుఖ్‌ఖాన్, రాణి ముఖర్జీ కీలక పాత్రలు పోషించారు. ఎన్నో వివాదాల మధ్య 2000 ఫిబ్రవరి 18న ఈ సినిమా విడుదలైంది. ఈ చిత్రంలో షారుక్ ఖాన్ తన పాత్ర కోసం ఒక్క పైసా కూడా తీసుకోలేదట. ఈ విషయాన్ని కమల్ స్వయంగా చెప్పారు. ఇలాంటి కథను, చిత్రాన్ని భవిష్యత్‌లో మళ్లీ చేసే అవకాశం రాదని వారు భావించారు. కొందరు మాత్రం ‘షారుఖ్ గురించి బిజినెస్ అండ్ కమర్షియల్ మైండెడ్ అని చెప్పారు. కానీ, ‘హే రామ్’ బడ్జెట్ ఏంటో షారుఖ్‌కు తెలుసు. తాను కేవలం సినిమాలో భాగస్వామి మాత్రమే అవ్వాలనుకున్నారు. లేదా కమల్‌తో కలిసి చిన్న సన్నివేశంలో కనిపిస్తే చాలు అని అనుకున్నారు. అనుకున్న బడ్జెట్ దాటిపోయినా ఆయన రూపాయి కూడా అడగలేదు అన్నారు. కేవలం తన చేతి గడియారం మాత్రం ఇచ్చినట్లు కమల్ తెలిపారు. అప్పట్లో ఎన్నో సవాళ్లను అధిగమించి విడుదలైన హే రామ్ సినిమా ప్రేక్షకుల ఆదరణ పొందింది. విమర్శకుల ప్రశంసలు సైతం అందుకుంది. అంతేకాదు, మూడు జాతీయ అవార్డులను సొంతం చేసుకుంది. ఉత్తమ సహాయ నటుడిగా అతుల్ కులకర్ణి, ఉత్తమ కాస్ట్యూమ్ డిజైనర్‌గా సారిక, ఉత్తమ విజువల్ ఎఫెక్ట్స్ విభాగంలో మంత్రకు అవార్డులు వచ్చాయి.