లోక్‌సభ ఎన్నికలు సమీపిస్తున్న టైమ్‌లో తమిళ స్టార్ హీరో, మక్కల్ నీది మయ్యం అధినేత కమల్ హాసన్ చేసిన వ్యాఖ్యలు వైరల్‌గా మారాయి. కమల్ చెన్నై ఎయిర్‌పోర్టులో విలేకరులతో మాట్లాడుతూ.. రెండు రోజుల్లో శుభవార్తతో మిమ్మల్ని కలుస్తానని, పార్లమెంట్ ఎన్నికలకు సంబంధించిన పనులు బాగానే జరుగుతున్నాయని, మంచి అవకాశం వస్తుందని, పొత్తుకు సంబంధించి రెండు రోజుల్లో నిర్ణయం ప్రకటిస్తామని తెలిపారు.
గతేడాది సెప్టెంబర్‌లో డీఎంకే నేత, తమిళనాడు మంత్రి ఉదయనిధి స్టాలిన్, కమల్ హాసన్ పార్టీలో పొత్తు పెట్టుకుంటామని హింట్ ఇచ్చారు. అయితే, ఎన్నికల సమయంలో పొత్తుపై పార్టీ నేతలు నిర్ణయం తీసుకుంటారని అన్నారు.
అదే సమయంలో.. సనాతనధర్మం గురించి మాట్లాడి దేశవ్యాప్తంగా విమర్శలు పాలైన ఉదయనిధి స్టాలిన్ గురించి ఉద్దేశిస్తూ.. చిన్న పిల్లవాడిని(ఉదయనిధి)ని టార్గెట్ చేస్తున్నారని, ఆయనను సమర్థిస్తూ కమల్ మద్దతు తెలిపారు.
2018లో కమల్ హాసన్ ‘మక్కల్ నీది మయ్యం(MNM)ని స్థాపించారు. 2019 లోక్‌సభ ఎన్నికల్లో, 2021 అసెంబ్లీ ఎన్నికల్లో ఘోర పరాజయాన్ని చవిచూశారు. 2022 డిసెంబర్ నెలలో తమిళనాడులో రాహుల్ గాంధీ ‘భారత్ జోడో యాత్ర’లో కమల్ హాసన్ కలిసి నడిచారు.