తమిళనాడు దివంగత ముఖ్యమంత్రి, దిగ్గజ నాయకురాలు జయలలిత బమోపిక్‌పై కమల్ హాసన్ స్పదించారు. రాష్ట్ర రాజకీయాల్లో చెరగని ముద్ర వేసిన శక్తిమంతమైన మహిళ జయలలిత అని కమల్ కొనియాడారు. ఈ సినిమా అన్నాడీఎంకే పార్టీకి నూతన జవసత్వాలు తీసుకొస్తుందనీ, ‘అమ్మ’ నిజమైన ఐరన్‌లేడీ అని నిరూపిస్తుందని విలేకరుల సమావేశంలో వెల్లడించారు. ఇక మారుతున్న కాలానికి అనుగుణంగా మనుషులు మారాలని మరోప్రశ్నకు సమాధానంగా చెప్పారు.
నేటి ఆధునిక సమాజం కులం, మతం గురించి మాట్లాడేందుకు అనుమతించదని వ్యాఖ్యానించారు. జాతి, కులం, మతం గురించి మాట్లాడే కాలం గతించిందని అన్నారు. ఈ రోజుల్లో కుల, మతాలపై అనుచిత వ్యాఖ్యలు చేయడం దేశద్రోహమే అవుతుందని హెచ్చరించారు. కాగా, ‘జయలలిత బయోపిక్‌కి ‘ది ఐరన్ లేడి’ అనే పేరును ఖరారు చేశారు. ప్రియదర్శిని దర్శకత్వంలో తెరకెక్కుతున్న ఆ సినిమా టైటిల్ పోస్టర్‌ను ఏఆర్ మురుగదాస్ లాంచ్ చేశారు. ఈ బయోపిక్‌లో జయలలిత పాత్రలో శరత్ కుమార్ కూతురు వరలక్ష్మీ శరత్ కుమార్ కనిపించబోతున్నారు. జయ పుట్టిన రోజున (ఫిబ్రవరి 24) షూటింగ్ ప్రారంభం కానుంది.