ప్రముఖ నటుడు కమల్ తన సొంత బ్యానర్లో ‘విక్రమ్’ సినిమాను నిర్మించారు. లోకేశ్ కనగరాజ్ డైరెక్షన్‌లో వచ్చిన ఈ సినిమా ఈ నెల 3వ తేదీన విడుదలైంది. హీరోయిన్ లేకుండా ఐదుగురు స్టార్స్ తో మొదటి నుంచి చివరి వరకూ లోకేశ్ కథను నడిపించాడు. కమల్ స్థాయికి తగిన భారీతనం ఎక్కడా తగ్గకుండా ఈ కథను ముందుకు తీసుకుని వెళ్లాడు.
అటు కోలీవుడ్ .. ఇటు టాలీవుడ్ లోనే కాదు, విడుదలైన ప్రతి ప్రాంతంలో ఈ సినిమా భారీ వసూళ్లను రాబడుతోంది. చాలా గ్యాప్ తరువాత హీరోగా .. నిర్మాతగా భారీ సక్సెస్ ను కమల్ ఎంజాయ్ చేస్తున్నారు. ఈ నేపథ్యంలో .. ఈ సంతోషంలో ఆయన ఈ సినిమా డైరెక్షన్ లోకేశ్ కనగరాజ్ కి ఖరీదైన కారును కానుకగా అందజేశారు.
కోటి రూపాయలకి పైగా ఖరీదైన ‘లెక్సస్ సెడాన్’ కారును కానుకగా లోకేశ్ అందుకుంటున్న ఫొటో ఇప్పుడు వైరల్ అవుతోంది. లోకేశ్ ఎన్నో కష్టాలుపడి ఈ స్థాయికి వచ్చాడనీ .. అలాంటి వాళ్లంటే తనకి ఇష్టమని చెబుతూ వచ్చిన కమల్, అతని పట్ల తనకి గల అభిమానాన్ని ఇలా చాటుకోవడం విశేషం.