కోలీవుడ్ ప్రముఖ నటులు రజనీకాంత్, విశ్వనటుడు, మక్కల్‌నీది మయ్యం అధినేత కమల్‌హాసన్ ఒక వేదికపై మెరిశారు. తమ సినీ జీవితంలో ప్రముఖ పాత్ర పోషించిన వారి గురువు కె.బాలచందర్ విగ్రహావిష్కరణలో వీరిద్దరూ కలుసుకున్నారు. తన సినీ ప్రస్థానానికి 60 ఏళ్లు పూర్తయిన సందర్భంగా కమల్ తన గురువు కె.బాలచందర్ విగ్రహాన్ని అల్వార్‌పేటలోని తన కార్యాలయంలో ఏర్పాటు చేశారు. ఈ కార్యక్రమానికి ప్రముఖ సినీ ప్రముఖులు మణిరత్నం, వైరముత్తు, రమేశ్ అరవింద్, సంతాన భారతి, నాజర్, కేఎస్ రవికుమార్ తదితరులు హాజరయ్యారు. ఈ సందర్భంగా కమల్ హాసన్ మాట్లాడుతూ.. రజనీకాంత్ తాను ఒకరు చేసే పనికి మరొకరం అభిమానులమని చెప్పారు. సినీ ప్రస్థానంలో బాలచందర్ స్థానం భర్తీచేయలేనిదని పలువురు వక్తలు కొనియాడారు. ఈ కార్యక్రమం అనంతరం సినీ ప్రముఖులంతా కలిసి సత్యం సినిమాస్‌లో హే రామ్ చిత్రాన్ని వీక్షించారు
కమల్ హాసన్ నిన్న తన 65వ పుట్టిన రోజు వేడుకలను జరుపుకొన్న విషయం తెలిసిందే. స్వస్థలమైన పరమకుడిలో గురువారం తండ్రి శ్రీనివాసన్ విగ్రహాన్ని కమల్ ఆవిష్కరించారు. కమల్‌హాసన్, చారుహాసన్, సుహాసిని, శ్రుతిహాసన్, అక్షరలతో పాటు కుటుంబ సభ్యులందరూ ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు. ఈ కార్యక్రమంలో కమల్ మాట్లాడుతూ.. తాను గత్యంతరం లేక రాజకీయాల్లోకి రాలేదన్నారు. తనకు నీడగా నిలిచిన కె.బాలచందర్‌కు తన కార్యాలయంలో విగ్రహాన్ని ఏర్పాటు చేశానని వెల్లడించారు. ఆ విగ్రహం సమాజం కోసం కాదనీ.. తన కోసమన్నారు. పూజ చేయడం కోసం తాను ఆ విగ్రహాన్ని ఏర్పాటు చేయలేదని చెప్పారు. తాను రాజకీయాల్లోకి రావడం తన కుటుంబంలో ఎవరికీ ఇష్టంలేదన్న కమల్.. తన తండ్రి మాత్రమే రాజకీయాల్లోకి రావాలని ఆశపడ్డారన్నారు. ఇప్పుడు ఆయన కల నెరవేరిందంటూ విశ్వనటుడు గుర్తు చేసుకున్నారు.