సౌత్ ఇండియాలోనే కాకుండా నార్త్ లో కూడా అభిమానులను సంపాదించుకున్న నటుడు కమల్ హాసన్. విభిన్నమైన చిత్రాలతో ప్రేక్షకులను ఆకట్టుకుంటున్న ఈ నటుడు రాజకీయాల్లోకి రాబోతున్నాడంటూ.. కొన్ని రోజులుగా వార్తలు వినిపిస్తున్నాయి. అయితే ఈ విషయంపై స్పష్టతనిచ్చారు కమల్ హాసన్.. అవినీతిపై పోరాడేందుకు తాను నిర్ణయించుకున్నానని, త్వరలోనే రాజకీయాల్లోకి వస్తున్నానని ప్రకటించారు. కోయంబత్తూరులో జరిగిన అఖిల్ భారత కమల్ హాసన్ అభిమాన సంఘం కోశాధికారి తంగవేలు వివాహానికి హాజరైన ఆయన, అక్కడివారిని ఉద్దేశించి కొన్ని వ్యాఖ్యలు చేశారు. మెరుగైన సమాజాన్ని నిర్మించడమే తన లక్ష్యమని, ఈ దిశగా తనతో పాటు కలిసి నడిచేందుకు యువత ముందుకు రావాలని ఆయన పిలుపునిచ్చారు.
రాజకీయాల్లో మార్పు రావాల్సిన సమయం వచ్చిందని, దానికి కోసం పోరాటం చేయాలని అన్నారు. ఓటుని అమ్ముకుంటే ప్రశ్నించే అధికారాన్ని కోల్పోతామని డబ్బు తీసుకొని ఓటు ఎవరు వేయరాదని కోరారు. చాలా మంది నాయకత్వం వహించే ధైర్యం మీకుందా అని నన్ను అడుగుతున్నారు.. నా నాయకత్వాన్ని ఆమోదించే ధైర్యం మీకుందా అంటూ కమల్ ప్రశ్నించారు. కమల్ మాటలతో ఆయన రాజకీయ ప్రవేశంపై మరింత స్పష్టత వచ్చింది. అయితే ఆయన సొంతంగా కొత్త పార్టీ పెడతారా..? లేక ఏదైనా పార్టీలో జాయిన్ అవుతారా..? అనే విషయంపై మాత్రం స్పందించలేదు.