స్టార్ హీరో, మక్కల్ నీది మయ్యమ్ పార్టీ అధినేత కమలహాసన్ పౌరసత్వ సవరణ చట్టం (సీఏఏ)ను కేంద్ర ప్రభుత్వం తీసుకు రావడంపై విమర్శలు గుప్పించారు. ఈ దేశాన్ని విభజించేందుకు సీఏఏను తీసుకొచ్చారని అన్నారు. లోక్ సభ ఎన్నికల్లో లబ్ధి పొందాలనే ఆలోచనతోనే సీఏఏ నిబంధనలను హడావుడిగా రూపొందించి విడుదల చేశారని దుయ్యబట్టారు.
సీఏఏ చట్టం ఎంత వరకు రాజ్యాంగబద్ధం అనే విషయం సుప్రీంకోర్టు పరిశీలనలో ఉన్న సమయంలో నిబంధనలను విడుదల చేశారని చెప్పారు. ముస్లింలు రంజాన్ మాసం తొలి రోజును జరుపుకుంటున్న రోజే సీఏఏకు చెందిన చెడు వార్తను వారు వినాల్సి వచ్చిందని కమల్ ఆవేదన వ్యక్తం చేశారు.
పాకిస్థాన్, బంగ్లాదేశ్, ఆఫ్ఘనిస్థాన్ దేశాల్లో అణచివేతకు గురైన మైనార్టీ ప్రజల కోసమే ఈ చట్టాన్ని తీసుకొస్తున్నామని కేంద్ర ప్రభుత్వం చెపుతోందని… అలాంటప్పుడు ఈ జాబితాలో శ్రీలంకలోని తమిళులను ఎందుకు చేర్చలేదని ప్రశ్నించారు. మన దేశాన్ని మతం, కులం, ప్రాంతం ఆధారంగా చీల్చాలనుకునే వారికి ఎన్నికల్లో బుద్ధి చెప్పాలని పిలుపునిచ్చారు.