నందమూరి కల్యాణ్ రామ్ నటించిన సోషియో ఫ్యాంటసీ ఎలిమెంట్స్ మూవీ ‘బింబిసార’. నందమూరి తారక రామారావు ఆర్ట్స్ పతాకంపై వశిష్ఠ్ దర్శకత్వంలో కె. హరికృష్ణ నిర్మించిన చిత్రం ‘బింబిసార’. టైమ్ ట్రావెల్ మూవీగా వచ్చిన ఈ మూవీ శుక్రవారం (ఆగస్టు 5) విడుదలైంది. మరి ఈ సినిమాతో కల్యాణ్ రామ్ ఆకట్టుకున్నాడా? లేదా? తెలుసుకోవాలంటే ఈ రివ్యూ చదవాల్సిందే.
కథ: త్రిగర్తల సామ్రాజ్యాన్ని ఏకచక్రాధిపతిగా పాలిస్తుంటాడు బింబిసారుడు (కల్యాణ్ రామ్). అహం, తనను ఎవరు ఎదిరించలేరనే పొగరుతో, పాలించే ప్రజలను, చిన్న పిల్లలను సైతం చూడకుండా అతి కిరాతకంగా చంపే కర్కోటకుడిగా రాజ్యాన్ని ఏలుతుంటాడు. ఈ క్రమంలోనే ఒక మాయ దర్పణం ద్వారా భూలోకానికి వస్తాడు. భూలోకంలో అతనికి వారసులు ఉన్నారని, అతని గురించి గొప్పగా చెప్పుకుంటున్నారని తెలిసిన బింబిసారుడు ఏం చేశాడు? అతి క్రూరుడైన రాజు బింబిసారుడు.. తన ప్రజల కోసం ప్రాణాలిచ్చే నిజమైన చక్రవర్తిగా, ఒక మానవత్వం గల మనిషిగా ఎలా మారాడు? టైమ్ ట్రావెల్ చేసేందుకు వీలుగా ఉన్న మాయ దర్పణం ఎలా వచ్చింది? బింబిసారుడు దాచిన నిధి తలపులు తెరవడానికి ప్రయత్నిస్తున్న సుబ్రహ్మణ్య శాస్త్రి (వివాన్ భటేనా) ఎవరు? అనే తదితర ఆసక్తికర విషయాలు తెలుసుకోవాలంటే ‘బింబిసార’ సినిమాను కచ్చితంగా చూడాల్సిందే.
నటీనటులు : నందమూరి కల్యాణ్ రామ్ నటన హైలైట్. ఈ చిత్రంలోని కల్యాణ్ రామ్ యాక్టింగ్ అతని కెరీర్‌లోనే ది బెస్ట్. సినిమా మొత్తం తాను ఒక్కడై నడిపించినట్లుగా ఉంటుంది. యువరాణి ఐరాగా కేథరీన్ థ్రేసా, ఎస్సై వైజయంతిగా సంయుక్త మీనన్ నటన పాత్రకు తగినట్లుగా పర్వాలేదు. కానీ వారి పాత్రలకు అంతా ప్రాముఖ్యత లేదు. శ్రీనివాస రెడ్డి, వెన్నెల కిశోర్, చమ్మక్ చంద్ర కామెడీతో అలరించారు. వివాన్ భటేనా, ప్రకాశ్ రాజు, రాజీవ్ కనకాల, అయ్యప్ప పి శర్మ తదితరులు పాత్రల పరిధిమేర ఆకట్టుకున్నారు. ఎంఎం కీరవాణి అందించిన బ్యాక్‌గ్రౌండ్ మ్యూజిక్ హైలెట్‌గా నిలిచింది. అలాగే కథకు అనుగుణంగా వచ్చిన ఒక్కో పాట కూడా అలరిస్తుంది. ఈ ఒక్కో సాంగ్‌ను చిరంతన్ భట్, వరి కుప్పల యాదగిరి, ఎంఎం కీరవాణి కంపోజ్ చేశారు. ఇక విజువల్ ఎఫెక్ట్స్, సినిమాటోగ్రఫీ, నిర్మాణ విలువలు అత్యద్భుతంగా ఉన్నాయి.
విశ్లేషణ: క్రీస్తుపూర్వం 5వ శతాబ్దంలో మగధ సామ్రాజ్యాన్ని పాలించిన రాజు బింబిసారుడు. నిజానికి ఇతను హర్యాంక రాజవంశానికి చెందినవాడు. అయితే ఈ బింబిసారుడు అనే పాత్రను తీసుకుని పూర్తి కల్పిత కథతో ‘బింబిసార’ను తెరకెక్కించారు దర్శకుడు. ‘ఏ టైమ్ ట్రావెల్ ఫ్రమ్ ఈవిల్ టు గుడ్’ అనే ఒక్క క్యాప్షన్‌తో సినిమా కథను చెప్పేశారు. చరిత్రలో బింబిసారుడు ఎలా ఉన్న ఈ సినిమాలో మాత్రం అత్యంత క్రూరుడిగా, మద గజ మహారాజుగా చిత్రీకరించారు. రాజ్యాన్ని తాను ఒక్కడే పాలించాలనే కోరికతో సొంత తమ్మున్ని సైతం చంపించే అన్నగా బింబిసారుడి పాత్రను ఆవిష్కరించారు. రాక్షస రాజుగా బింబిసార పాత్రలో కల్యాణ్ రామ్‌ను చూపించారు. అహంతో మదమెక్కి అరాచకాలు, ఆకృత్యాలు చేసే చక్రవర్తిగా బింబిసారుడిని చూపించడంలో డైరెక్టర్ పూర్తిగా సక్సెస్ అయ్యారు. తర్వాత ఒక నిజమైన రాజుగా, మంచి మనిషిగా బింబిసారుడు మారే క్రమాన్ని కూడా అంతే బాగా తెరకెక్కించారని చెప్పవచ్చు.
త్రిగర్తల సామ్రాజ్యం, అక్కడి భాషా, వేషం అన్ని చక్కగా చూపించారు. విజువల్ ఎఫెక్ట్స్, సినిమాటోగ్రఫీ అద్భుతంగా ఉంది. ఒకటి, రెండు సీన్లలో త్రిగర్తల సామ్రాజ్యపు కోట ఆర్టిఫిషియల్‌గా కనిపించిన మిగతా సీన్లలో మాత్రం కన్నులకు విందుగా కనిపించింది. ఫ్యామిలీ డ్రామాతో వచ్చే కొన్ని ఎమోషనల్ సన్నివేశాలు కొంచె రొటీన్‌గా అనిపించిన ఆకట్టుకునేలా ఉన్నాయి. అక్కడక్కడ వచ్చిన కామెడీ కూడా బాగానే పండింది. కొన్ని సీన్లు, విజువల్స్ ఇతర సినిమాల్లో చూసిన ఫీలింగ్ కలుగుతుంది. సెకండాఫ్‌లో వచ్చే ఫైటింగ్ సీన్స్ చాలా బాగున్నాయి.
టైటిల్ : బింబిసార
నటీనటులు : కల్యాణ్ రామ్, కేథరీన్ థ్రేసా, సంయుక్త మీనన్, ప్రకాశ్ రాజ్, వివాన్ భటేనా, అయ్యప్ప పి శర్మ తదితరులు
కథ, దర్శకత్వం, స్క్రీన్‌ప్లే: వశిష్ఠ
నిర్మాత : హరికృష్ణ. కె
సంగీతం : చిరంతన్ భట్, ఎంఎం కీరవాణి
హైలైట్స్: కల్యాణ్ రామ్ నటన
డ్రాబ్యాక్స్: కొన్ని సన్నివేశాలు చూసినవిగా అనిపిస్తాయి
చివరిగా: రాక్షస రాజు ‘బింబిసార’గా మెప్పించిన కల్యాణ్ రా్
(గమనిక: ఇది కేవలం సమీక్షకుడి వ్యక్తిగత అభిప్రాయం మాత్రమే)