HomeTelugu Big StoriesKalki2898AD Review: నాగ్ అశ్విన్ సృష్టించిన సరికొత్త ప్రపంచం ఎలా ఉంది?

Kalki2898AD Review: నాగ్ అశ్విన్ సృష్టించిన సరికొత్త ప్రపంచం ఎలా ఉంది?

Kalki
Kalki 2898 AD movie review

Kalki 2898 AD: ప్రభాస్ అభిమానులందరూ ఎప్పుడెప్పుడా అని ఎదురుచూస్తున్న కల్కి 2898 ఏడి సినిమా ఎట్టకేలకు విడుదల అయిపోయింది. నాగ అశ్విన్ దర్శకత్వం వహించిన ఈ సినిమా భారీ అంచనాల మధ్య ఇవాళ అనగా జూన్ 27న థియేటర్లో విడుదలైంది. మరి ఈ సినిమా ఎంతవరకు అంచనాలను అందుకుందో చూసేద్దామా..

కథ:

టైటిల్ కి తగ్గట్టుగానే సినిమా కథ 2898 ఏడి లో జరుగుతుంది. కాంప్లెక్స్ ప్రపంచంలో కమల్ హాసన్ ఒక పవర్ ఫుల్ విలన్ పాత్ర పోషించారు. ఫెర్టిలిటీ ల్యాబ్ లో ఆయన చేసే ఒక ప్రయోగం కోసం గర్భంతో ఉన్న దీపిక పడుకొనే అవసరం అవుతుంది. ఒక మంచి జీవితం కోసం భైరవ (ప్రభాస్) పాత్ర కాంప్లెక్స్ కి వస్తుంది. మరోవైపు అశ్వద్ధామ (అమితాబ్ బచ్చన్) సుమతి పాత్రను కాపాడాలి అనుకుంటారు. అసలు కమల్ హాసన్ పాత్ర ఏంటి? అతనికి ఏం కావాలి? అతను చేస్తున్న ప్రయోగం ఏంటి? అశ్వద్ధాముడు ఎందుకు సుమతిని కాపాడాలి అనుకుంటాడు? చివరికి ఏమైంది? తెలియాలంటే సినిమా చూడాల్సిందే..

నటీనటులు:

భైరవ పాత్ర లో ప్రభాస్ చాలా బాగా నటించారు. కానీ ప్రభాస్ స్క్రీన్ టైమ్ మాత్రం ప్రేక్షకులను తీవ్రంగా నిరాశ పరుస్తుంది. చాలా వరకు సినిమాలలో అక్కడక్కడ మాత్రమే కనిపించే ప్రభాస్ ఏదో క్యామియో పాత్ర చేసినట్లు అనిపిస్తుంది. సినిమాలో మెయిన్ హీరో అయినప్పటికీ మూడు గంటల నిడివి ఉన్న సినిమాలో ప్రభాస్ అక్కడక్కడ మాత్రమే కనిపించడం సినిమాకి అతి పెద్ద మైనస్ పాయింట్. ప్రభాస్ పాత్రలో కూడా అంత డెప్త్ ఉండదు. ఏదో అక్కడక్కడ వచ్చి కామెడీ జనరేట్ చేయడానికి జోకులేసినట్టు అనిపిస్తుంది. ఫస్ట్ హాఫ్ తో పోల్చుకుంటే సెకండ్ హాఫ్ లో ప్రభాస్ పాత్ర బాగానే కనిపిస్తుంది. ముఖ్యంగా ఆఖరి 20 నిమిషాల్లో ప్రభాస్ తన పాత్రలో జీవించారు అని చెప్పుకోవచ్చు.

అశ్వద్ధాముడి పాత్రలో అమితాబ్ బచ్చన్ నటన సినిమాకి అతిపెద్ద హైలైట్. ఆయన స్క్రీన్ ప్రజెన్స్, నటన మంచి ఇంపాక్ట్ ఇస్తాయి. సెట్స్ లో ఉన్న మిగతా అందరికంటే ఎక్కువ వయసు ఉన్న నటుడు అయినప్పటికీ అమితాబ్ బచ్చన్ యాక్షన్ ఎపిసోడ్స్ లో కూడా చాలా బాగా నటించారు.

కమల్ హాసన్ మేకప్ కోసమే చాలా కష్టపడ్డారని ఈ సినిమా చూస్తే అర్థమవుతుంది. కమల్ హాసన్ నటన గురించి విడిగా చెప్పాల్సిన అవసరం లేదు. ఎలాంటి పాత్రలోనైనా ఇట్టే ఒదిగిపోగల కమల్ హసన్ ఈ పాత్రని కూడా చాలా బాగా పండించారు. అయితే కమల్ హాసన్ పాత్ర ఎక్కువగా కనిపించకపోయినా సీక్వెల్ కి హింట్ ఇస్తుంది.

దీపికా పడుకొనే పాత్ర చాలా స్లోగా డెవలప్ అవుతుంది. ఆమె స్క్రీన్ టైమ్ కూడా ఎక్కువగానే ఉంటుంది. ప్రేక్షకులు ఆమె పాత్రకి కూడా పెద్దగా కనెక్ట్ అవ్వలేకపోయినా నటన పరంగా దీపిక చాలా బాగా నటించింది.

దిశా పటాని పాత్రకి బోలెడంత స్క్రీన్ టైమ్ దొరికింది కానీ ఆమె పాత్ర ప్రేక్షకులకి అంతగా కనెక్ట్ అవ్వదు. ఆఖరికి సినిమా కథలో కూడా ఆమె పాత్ర వల్ల కలిగే మార్పులు ఏమీ ఉండవు.

రాజేంద్ర ప్రసాద్, శోభన, బ్రహ్మానందం వంటి స్టార్ నటుల గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. తమ పాత్రలలో వాళ్ళు చాలా అద్భుతంగా నటించారు. అయితే బ్రహ్మానందం పాత్ర నుంచి అందరూ ఊహించిన కామెడీ మాత్రం ఉండదు. ముఖ్యంగా బ్రహ్మానందం, ప్రభాస్ మధ్య సన్నివేశాలు కూడా అంత బాగా ఆకట్టుకోలేకపోయాయి.

అన్నా బెన్, శాశ్వత చటర్జీ కూడా చాలా బాగా నటించారు. కానీ వాళ్ళ పాత్రలు అంత గుర్తుండి పోయేలా లేవు. బుజ్జి పాత్రకి కీర్తి సురేష్ వాయిస్ ఓవర్ చాలా బాగా అనిపిస్తుంది.

టెక్నికల్ టీమ్:

జోర్డ్జే స్టోజిల్జ్కోవిచ్ కెమెరా పనితీరు ఈ సినిమాకి అతిపెద్ద ఎసెట్. ఆర్ట్ డైరెక్షన్ పనితీరు కూడా చాలా బాగుంది. అనిల్ జాదవ్, సంతోష్ శెట్టి సినిమా కోసం పడ్డ కష్టం తెరమీద కనిపిస్తుంది. కోటగిరి వెంకటేశ్వరరావు ఎడిటింగ్ పర్వాలేదు అనిపిస్తుంది. సినిమాలో కొన్ని అనవసరమైన సన్నివేశాలు కూడా ఉన్నాయి. అవి తీసేసి రన్ టైం ట్రిమ్ చేసి ఉంటే బాగుండేది. కింగ్ సొలొమోన్ కొరియోగ్రాఫ్ చేసిన యాక్షన్ సన్నివేశాలు చాలా బాగున్నాయి. అందులోని విజువల్ ఎఫెక్ట్స్ కచ్చితంగా ప్రేక్షకులను ఆకట్టుకుంటాయి. ముందు నుంచి అనుకుంటున్నట్లే సంతోష్ నారాయణన్ మ్యూజిక్ అంతంతమాత్రంగానే అనిపిస్తుంది. సినిమాలోని కీలక సన్నివేశాల్లో కూడా సంతోష్ అందించిన ట్యూన్స్ పాత్రలను లేదా సన్నివేశాన్ని ఎలివేట్ చేయలేకపోయాయి. అయితే సెకండ్ హాఫ్ లో మాత్రం యాక్షన్స్ సీన్స్ లో సంతోషం మ్యూజిక్ పర్వాలేదు అనిపిస్తుంది.

వైజయంతి మూవీస్ వారి నిర్మాణ విలువలు అంచనాలకు మించి ఉన్నాయి. భారీ బడ్జెట్ సినిమాలు తీయడం వారికి కొత్త కాదు. కల్కి సినిమా విషయంలో కూడా వాళ్ళ నిర్మాణ విలువలు చాలా బాగున్నాయి. ప్యాన్ ఇండియా రేంజ్ లో నిర్మాణ విలువలలో వెలిత్తి చూపించడానికి ఏమీ లేదు.

విశ్లేషణ:

నాగ్ అశ్విన్ తన మైండ్ లో అనుకున్న ఒక సరికొత్త ప్రపంచాన్ని వెండి తెర మీద చూపించడంలో చాలా బాగా సక్సెస్ అయ్యారు. సరికొత్త పాత్రలు డిజైన్ చేయడంలో మంచి మార్కులు వేయించుకున్న నాగ్ అశ్విన్ ఆ పాత్రలతో ప్రేక్షకులను ఎమోషనల్ గా కనెక్ట్ చేయడంలో మాత్రం విఫలమయ్యారని చెప్పుకోవచ్చు.

సినిమా కథ మొదలవడమే అశ్వద్ధామ గా అమితాబ్ బచ్చన్ పాత్రతో మొదలవుతుంది. ఆ తర్వాత రాజేంద్రప్రసాద్, శోభన పాత్రలు కూడా ప్రేక్షకులను ఆకట్టుకుంటాయి. భైరవ పాత్రలో ప్రభాస్ ఎంట్రీ సీన్ చాలా బాగుంటుంది. అప్పటిదాకా సీరియస్ గా నడిచిన కథ భైరవ ఎంట్రీ తో ఒక్కసారిగా ఎంటర్టైనింగ్ గా మారుతుంది. ప్రభాస్ ఇంట్రో తర్వాత వచ్చే ఫైట్ సీన్ కూడా బాగానే అనిపిస్తుంది.

సుమ్-80 పాత్రలో ఒక ల్యాబ్ సబ్జెక్టుగా దీపిక పడుకొనే నటన చాలా అద్భుతంగా ఉంది. తన పాత్రకి దీపికా పూర్తిస్థాయిలో న్యాయం చేసింది.

నటనపరంగా కమల్ హాసన్ నెక్స్ట్ లెవెల్ అని చెప్పుకోవచ్చు. కానీ ఆయన పాత్ర ఇంట్రడక్షన్ చాలా యావరేజ్ గా అనిపిస్తుంది. ఆయన పాత్ర ఎంట్రీ లో విజువల్ ఎఫెక్ట్స్ బాగానే ఉన్నా ఫాన్స్ కి మాత్రం మంచి హై ఇవ్వలేకపోయింది.

దిశా పఠాని నటన పరంగా బాగానే అనిపించినా ఆమె పాత్ర చాలా బోరింగ్ గా అనిపిస్తుంది. ఆమె పాత్ర వల్ల సినిమా కథలో ఎలాంటి మార్పు ఉండదు.

స్ట్ హాఫ్ లోనే సినిమాలోని అన్ని పాత్రలు కనిపించేస్తాయి. కానీ ఒకరి పాత్ర చాలా బాగా హైలైట్ అయింది అని మాత్రం చెప్పలేం. ముఖ్యంగా ప్రభాస్ పాత్ర ఫస్ట్ హాఫ్ లో పెద్దగా కనిపించదు. ప్రభాస్ నటన చాలా బాగున్నప్పటికీ తన పాత్ర మాత్రం ఫస్ట్ హాఫ్ లో అక్కడక్కడ మాత్రమే కనిపిస్తుంది. అది అభిమానులను నిరాశ పరుస్తుంది.

ఒక మంచి ఇంటర్వెల్ బ్యాంగ్ తో ఫస్ట్ హాఫ్ పూర్తవుతుంది. సెకండ్ హాఫ్ ఎలా ఉండబోతుందో అనే ఆసక్తి అందరిలోనూ డెవలప్ అవుతుంది. సెకండ్ హాఫ్ మొదలవడమే ఒక మంచి యాక్షన్ సీక్వెన్స్ తో మొదలవుతుంది. డైరెక్టర్ నాగ్ అశ్విన్ స్వయంగా చెప్పినట్లు సెకండ్ హాఫ్ మొత్తం యాక్షన్స్ సన్నివేశాలు ఉంటాయి. ప్రతి సన్నివేశాన్ని చాలా బాగా చూపించారు. సెకండ్ హాఫ్ మొత్తం టెక్నికల్ టీం పనితీరు చాలా బాగా కనిపిస్తుంది.

నాగ్ అశ్విన్ సినిమాలలో ఏం ఉన్నా లేకపోయినా కచ్చితంగా ఎమోషన్ మాత్రం ఉంటుంది. మహానటి సినిమా విషయంలో కూడా ప్రేక్షకులు సినిమాకి అంత బాగా కనెక్ట్ అవ్వడానికి గల కారణాం ఆ ఎమోషన్. కానీ కల్కి సినిమాలో అది కనిపించకపోవడం బాధాకరం. విజువల్స్ పరంగా ఎంత బాగా ఉన్నా కూడా ప్రేక్షకులు సినిమాకి కనెక్ట్ అవ్వలేకపోతారు. అది ఈ సినిమాకి అతి పెద్ద మైనస్ పాయింట్ అని చెప్పుకోవచ్చు. ఎమోషన్స్ పక్కన పెట్టేస్తే యాక్షన్ పరంగా సినిమా చాలా బాగుంది. ముఖ్యంగా సెకండ్ హాఫ్ యాక్షన్ నచ్చే వాళ్ళకి చాలా బాగా నచ్చుతుంది.

సినిమా క్లైమాక్స్ ట్విస్ట్ చాలా బాగుంటుంది. కానీ సీక్వెల్ కి ఐడియా ఇస్తూ కథని సడన్ గా మధ్యలో ఆపేసినట్లు అనిపిస్తుంది. ఎంత సీక్వెల్ గురించి చెప్పాలి అనుకున్న సినిమాకి ఒక మంచి ఎండింగ్ ఇస్తే బాగుండేది అనిపిస్తుంది.

తీర్పు:

రివ్యూ తో సంబంధం లేకుండా కల్కి కచ్చితంగా ధియేటర్లలో చూడాల్సిన సినిమా. సినిమాలో ఉన్న అదిరిపోయే విజువల్స్ కచ్చితంగా థియేటర్లో ఎక్స్పీరియన్స్ చేయాల్సిందే. ఒక చిన్న పాయింట్ తో నాగ్ అశ్విన్ సినిమా కథని బాగానే నడిపించారు. అయితే కథలో ఎమోషన్స్ మాత్రం సరిగ్గా పండించలేకపోయారు. టెక్నికల్ టీమ్ పనితీరు చాలా అద్భుతంగా ఉంది. నాగ్ అశ్విన్ తను సృష్టించిన ప్రపంచంతో పెద్దగా మెప్పించలేకపోయాడు కానీ ప్రేక్షకులను ఆ ప్రపంచాన్ని అద్భుతంగా చూపించడంలో మాత్రం సక్సెస్ అయ్యాడు.

Recent Articles English

Gallery

Recent Articles Telugu